News

అయోధ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ రోజున భక్తుల సమన్వయానికి రిహార్సల్​గా దీపోత్సవం

256views

అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్​లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది. నవంబర్​ 10 నుంచి 14 వరకు ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులు లక్షల్లో పాల్గొన్నట్లుగా పేర్కొంది. దీపోత్సవం రోజునే ఏకంగా 2 లక్షల మందికిపైగా ప్రజలు శ్రీరాముడిని దర్శించుకున్నారని విశ్వహిందూ పరిషత్​ మీడియా ఇంఛార్జ్​ శరద్​ శర్మ వెల్లడించారు.

రిహార్సల్​గా దీపోత్సవం..
జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యే లక్షలాది భక్తులను సమన్వయం చేసుకోవడానికి ట్రయల్​గా దీపోత్సవం నిర్వహించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా రాముడిని దర్శించుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. బృందాలుగా ఏర్పడిన రామభక్తుల సాయంతో.. సాధారణ ప్రజలకు సులువుగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వివిధ చెక్​పాయింట్లను ఏర్పాటు చేసి… ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా క్యూలైన్​లో భక్తులను రాముడిని దర్శనానికి పంపించారు. దీపోత్సవానికి వచ్చిన భక్తుల సంఖ్య ఆధారంగా రానున్న రోజుల్లో ఎంతమంది వస్తారనే అంచనాకు వచ్చి మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.