
బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ఇదివరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బ్యాంకులలో లావాదేవీలు జరిగేవి. అయితే ఆ పనివేళలను 10 నుంచి 6 గంటల వరకు నిర్వహించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచన ప్రాయంగా తెలియజేసింది. దీంతో వ్యాపార వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వెసులుబాటు కల్పించినట్లేనని తెలుస్తోంది. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ద్వారా ఎంతైనా చేసుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. కమీషన్లు కూడా తగ్గిస్తున్నట్లు చెప్పడంతో వ్యాపారవర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈనెల 1వతేదీ నుంచి పనివేళలు, కమీషన్ల మార్పు అందుబాటులోకి తీసుకురావాలని యోచించినప్పటికీ వాయిదా పడినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సమాచారం ఇచ్చి, మార్పులు చేసేందుకు కొంత గడువు ఇచ్చినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్ణయం ఇటు ప్రజలు, అటు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
అంతేగాక ఆర్‌టీజీఎస్ లావాదేవీల పరిమితిని ఎత్తివేసి, ఎంతైనా చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆర్‌బీఐ ఆదేశానుసారం వారంలో ఐదు రోజులే బ్యాంకులు పనిచేస్తాయా లేక ఆరు రోజులు పనిచేస్తాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతి నెలా రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారంతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. ఆర్‌బీఐ సూచనల ప్రకారం ఆ రెండు రోజులు అంటే ప్రతి నెల ఒకటో శనివారం, మూడో శనివారం కూడా బ్యాంకులు మూతపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు మేలు జరిగేలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకుల పనివేళల మార్పు ఉపయోగకరమేనని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.





