ArticlesNews

ఆధ్యాత్మిక ప్రేమభక్తికి నిలువెత్తు రూపం కవయిత్రి మీరాబాయి

416views

( అక్టోబర్ 28 – మీరాబాయి జయంతి )

భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాటపడడం, ఏడ్వటం, బాధ పడడం..అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుడిని స్మరించడమే భక్తి. నిశ్చలమైన భక్తికి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అనడానికి ఉదాహరణ మీరా బాయి. మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి మార్గమని చాటడమే కాకుండా అటువంటి భక్తి మార్గంలో పయనించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిలో ఐక్యం అయింది.

మీరాబాయి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రాజ్‌పుత్ రాజు రతన్ సింగ్‌కు 1498లో జన్మించింది. మీరా తన రెండవ ఏటనే తల్లిని కోల్పోవడంతో తాత రావ్ దూడా సంరక్షణలో పెరిగింది. ఆయన విష్ణువు భక్తుడు కావడంతో ఆయన వద్దకు సాధువులు, ‌ఋషులు వచ్చేవారు. అలా మీరాలో శ్రీకృష్ణుడిపై భక్తి బీజం నాటుకుంది. మీరా బాయి 1516లో రాణా సంగ కుమారుడు, మేవార్ యువరాజు భోజరాజ్‌ను వివాహం ఆడింది. ఆయన ఓ యుద్ధంలో గాయపడి 1521లో మరణించాడు. భర్త మరణానంతరం మీరాలో శ్రీకృష్ణుడి పట్ల భక్తిభావం మరింత పెరిగింది. మీరా తరచుగా శ్రీకృష్ణుడి గుడికి వెళ్లి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ముందు, ఆయన భక్తుల ఎదుట గానం చేయడం, నృత్యం చేయడం ప్రారంభించింది. ఇది నచ్చని మీరాబాయి అత్తింటివారు ఆమెపై విష ప్రయోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓసారి పూలబుట్టలో పామును ఉంచి మీరాకు అందించగా ఆ బుట్టలో ఆమెకు శ్రీకృష్ణుని విగ్రహం లభించింది. ఓసారి శ్రీకృష్ణుడి ప్రసాదమంటూ అత్తింటివారు మీరాకు విషాన్ని ఇచ్చారు. అది విషం అని తెలిసి కూడా మీరా సేవించింది. కానీ, ఆ మాధవుడి కృపతో ప్రాణాలు తీసే విషం మధువుగా మారిపోయింది.

ప్రహ్లాదుడిని తన తండ్రి హిరణ్యకశిపుడి బారి నుంచి శ్రీమహావిష్ణువు ఏవిధంగా రక్షించాడో, ఆ రీతిలోనే మీరాబాయికి శ్రీకృష్ణుడు రక్షణ కవచంగా నిలిచాడు. అత్తింటివారి ఆగడాలు శృతిమించడంతో తులసిదాస్ సలహాతో బృందావన్ చేరింది. బృందావనంలోని విష్ణు భక్తులకు జీవ గోస్వామి పెద్దగా ఉండేవారు. ఆయన్ను దర్శించుకునేందకు మీరాబాయి ప్రయత్నించగా ఆడవారిని చూసేందుకు తనకు ఇష్టం లేదని నిరాకరించారు. దీంతో మీరాబాయి బృందావనంలో శ్రీకృష్ణుడు కాకుండా మరో పురుషుడు కూడా ఉన్నాడా అని ప్రశ్నిస్తుంది. మీరాబాయి ఆంతర్యం అర్థం కావడంతో జీవగోస్వామి స్వయంగా మీరాబాయిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదం అందుకున్నారు. శ్రీకృష్ణుడి పట్ల అంతటి భక్తిభావాన్ని మీరాబాయి ప్రదర్శించడమే కాదు తనను తాను అర్పించుకుంది. బృందావనంలో కొంత కాలం ఉన్న మీరాబాయి అనంతరం ద్వారకకు పయనం అయ్యారు. అక్కడ ఆమె రాంచోడ్ ఆలయంలో శ్రీకృష్ణుని ప్రతిమలో లీనం అయ్యారు.

మీరా కేవలం భక్తురాలు మాత్రమే కాదు ఒక సాధువు, ఒక తత్వవేత్త, ఒక కవి, ఒక ఋషి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. యువరాణిగా జన్మించినా ఆ జీవితాన్ని త్యజించి పేదరికం, కాఠిన్యం, త్యాగం, తితిక్ష, వైరాగ్య జీవితాన్ని ఎంచుకుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆధ్యాత్మిక మార్గంలో మనోధైర్యంతో అడుగులు ముందుకేసింది. మీరా బాయి గేయాలు మన మనస్సుల్లో విశ్వాసం, ధైర్యం, భక్తి, ప్రేమను నింపుతాయి. భయమే ఎరుగని స్వభావం ఆమెది. నిరాడంబర జీవితాన్ని గడపింది. కుటుంబ సభ్యులు తిరస్కరించినా సంతోషంగా స్వీకరించింది. నిద్రాణ స్థితిలో కూడా ఆ గోపాలుడినే స్మరించింది. పూజించింది. ప్రేమించింది.

మీరాబాయి ప్రేమకు స్వరూపం, హృదయాన్నే ఆలయంగా మలిచింది. ఆమె చూపుల్లో దయ, మాటల్లో ప్రేమ, ఉపన్యాసాల్లో ఆనందం, మాటల్లో శక్తి, పాటల్లో ఆవేశం తాండవిస్తాయి. మనోహరమైన భక్తి మార్గాన్ని చూపించిన మీరాబాయి 1498 ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడు జన్మించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 28న ఆమె జయంతిని జరుపుకుంటున్నాము. మీరాబాయి జయంతిని పురస్కరించుకొని రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్‌లో మీరా మహోత్సవ్‌ను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ ఆలయాల్లో మీరాబాయిని స్మరిస్తూ ప్రత్యేక పూజలు, కీర్తనలు, భజనలు నిర్వహిస్తారు. మీరాబాయి ఈ భూమిపై నడయాడిన ప్రేమభక్తికి నిలువెత్తు రూపం.