
( అక్టోబరు 28 – వాల్మీకి మహర్షి జయంతి )
సామాన్య ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమాజంలో మానవతా విలువలు పెంపొందటానికి దోహదం చేసిన మహోన్నతులు శ్రీ వాల్మీకి మహర్షి. శ్రీరామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆది కవి మాత్రమే కాదు వేదాంతి, తపస్వి, దార్శనికుడు కూడా. సంస్కృత కవితారీతుల వైభవాన్ని లోకానికి చాటారు. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నది కూడా వాల్మీకి మహర్షులే.
వల్మీకం అంటే పుట్ట. ఆ పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడని కూడా అంటారు. శ్రీమద్రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి బోయకులంలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. తన కుటుంబ పోషణ కోసం దారి దోపిడీలు చేసేవాడు. ఒకసారి అత్రి మహర్షిని అడ్డగించినప్పుడు వారి ద్వారా జ్ఞానోపదేశం పొంది తీవ్రమైన తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా మారతాడు. అనంతరం తన శిష్యులతో కలిసి ఆశ్రమ వాసం చేస్తుండగా ఒకరోజు స్నానం చేసేందుకు తమసా నది తీరానికి వెళ్లినప్పుడు అక్కడ బోయవాడు ఒకడు చెట్టుపై సంభోగం చేసుకుంటున్న క్రౌంచపక్షులను గురి చూసి బాణం వేయగా అది వాటిలోని మగ పక్షికి తగులగా అది నేలకూలి మరణిస్తుంది. చనిపోయిన మగ పక్షిని చూసి ఆడపక్షి విలపించటాన్ని చూసిన వాల్మీకి అప్రయత్నంగా ‘‘ మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ: శాశ్వతీ: సమా:! యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీ: కామమోహతమ్!!’’ అనే శ్లోకాన్ని వెలువరిస్తారు.
వాల్మీకి మహర్షి తన ద్వారా వెలువడిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ అన్యమనస్కంగా గడుపుతున్న సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి తన ప్రోద్భలంతోనే సరస్వతీదేవి ద్వారా శ్లోకం పలికింపబడిందని తెలిపి సంపూర్ణ రామాయణాన్ని రచించాల్సిందిగా కర్తవ్యోన్ముఖులను గావిస్తాడు. అలా జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మనకందించారు వాల్మీకి మహర్షి. ఆయన అందించిన శ్రీమద్రామాయణం ఇతిహాసమే కాక, ఆది కావ్యంగా ప్రశస్తిగాంచింది. మానవాళిని కర్తవ్యపథంలో నడిపించే కార్యంలో వేదము ప్రభువు వలె శాసించేది కాగా పురాణం మిత్రుని వలె సూచించేది. అయితే కావ్యము కాంత వలె ఉపదేశాత్మకమై మానవుని కర్తవ్యోన్ముఖుని చేస్తుంది. ‘రామవత్ వర్తితవ్యం, న రావణవత్’ అనే దివ్య సందేశాన్ని మనకు అందించి తరించే మార్గం చూపించారు వాల్మీకి మహర్షి.
రామాయణంలో మానవ ధర్మాల గురించి వాల్మీకి మహర్షి చక్కగా విశదపరిచారు. శిష్య ధర్మం, భాతృధర్మం, రాజధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు.
వాల్మీకి మహర్షి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలను సరస్వతీ, లక్ష్మి, మాయ కటాక్షాన్ని కలుగజేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు. ఆదికవి వాల్మీకి ఆ రోజుల్లోనే అక్షరలక్ష అనే ఈనాటి ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వన్ని అందించారు. యోగవాశిష్టం అనే యోగా, ధ్యానం గురించిన మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు. రామాయణాన్ని మహాకావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన ఆ మహోన్నత వ్యక్తి జయంతిని అక్టోబర్ 28న జరుపుకుంటున్నాము. ప్రతివారు రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే, వాల్మీకి మహర్షి ఋణం తీర్చుకున్నట్లే..





