News

కేరళ వ్యాప్తంగా దేవాలయ మైదానాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలపై నిషేధం : సర్క్యులర్ జారీ చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్

511views

కేరళలో లెఫ్ట్‌ ప్రభుత్వం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ మధ్య వివాదం ముదిరింది. ఆలయాల స్థలాల్లో ఆర్ఎస్ఎస్ ఆయుధాలతో కసరత్తులు చేయిస్తోందంటూ సీఎం విజయన్‌ సర్కార్‌ ఏకంగా దేవాలయాల ఆవరణలు, వాటి ఆధీనంలోని మైదానాల్లో శాఖల నిర్వహణ, ప్రదర్శనలను నిర్వహించడాన్ని నిషేధించింది.

ఆలయాల నిర్వహణ బాధ్యత ఆయా దేవస్థానాల బోర్డులకే ఉంటుందని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేసింది. తిరువనంతపురంలోని శంకరదేవి ఆలయం ప్రాంగణాన్ని ఆరెస్సెస్‌ ఆక్రమించుకొని శాఖలు నిర్వహిస్తోందంటూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పు ఇస్తూ అలాంటివి కుదరవని తెలిపింది. దానిని అన్ని ఆలయాలకు వర్తింపజేస్తూ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది. దాంతో తమ ఆలయం పరిధిలో ఉన్న మైదానాల్లో ఆరెస్సెస్‌, ఇతర తీవ్ర భావజాల సంస్థలు ఎలాంటి డ్రిల్‌ జరపకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ట్రావంకోర్‌ దేవస్వాం బోర్డు పేర్కొంది. దీని ప్రకారం ఆ ప్రదేశాల్లో ఆరెస్సెస్‌ శాఖలు నిర్వహించడానికి వీల్లేదు. ఆలయాల ఆవరణల్లో వాటి జెండాలనుగానీ, ఇతర చిహ్నాలనుగానీ ప్రదర్శించకూడదు. ఈ ఉత్తర్వులను బీజేపీ తీవ్రంగా ఖండించింది.

మార్క్సిస్టులతో సంస్కృతి నాశనం

సాంస్కృతిక మావోయిస్టులు, పేరుగొప్ప మేధావులు మీడియాను, విద్యాసంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆరెస్సెస్‌ సర్ సంఘ్ చాలక్ మోహన్‌ భాగవత్‌ ఆరోపించారు. ఈ స్వార్థ, వివక్షాపూరిత శక్తులు మన దేశ విద్యా వ్యవస్థను, సంస్కృతిని నాశనం చేస్తున్నాయని విమర్శించారు. ఈ విధ్వంసక శక్తులు తమను తాము మేధావులుగా చెప్పుకొంటాయని.. ఈ అస్తిత్వవాదులు తమకు ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నట్లు పేర్కొంటారని.. కానీ వారి వాస్తవ లక్ష్యం ప్రపంచ శాంతిభద్రతలను భగ్నం చేయడమేనని ధ్వజమెత్తారు.