News

ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులపై దాడి, ముగ్గురికి గాయాలు

249views

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా కరునాగపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు స్వయం సేవకులు గాయపడ్డారు. కరునాగపల్లిలో జరిగిన పథ సంచాలన్‌కు స్వయం సేవకులు హాజరైన కొద్దిసేపటికే పుతియకావు జంక్షన్ వద్ద ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో అక్షయ్, మిథున్ లాల్, కిరణ్ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరునాగపల్లి తాలూకా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేశారు. వీరు కులశేఖరపురం నివాసి యాసిమ్, కరునాగపల్లికి చెందిన తాజవ, కడతూర్‌కు చెందిన నౌఫల్‌గా పోలీసులు గుర్తించారు.

ఆర్ఎస్‌ఎస్ స్వయం సేవకుల దాడి ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కన్నూర్ జిల్లా తలస్సేరిలో ఆర్ఎస్‌ఎస్ స్వయం సేవక్ ఇంటిపై బాంబు దాడి జరిగింది. తలస్సేరిలోని కొడియేరి నివాసి షాజీ శ్రీధరన్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంతో ప్రస్తుతం కొనసాగుతున్న పోలీసులు విచారణపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసుల అసమర్థత కారణంగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.