News

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ అదరహో

223views

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. పోటీల తొలిరోజు, సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలు.. రెండోరోజు, మంగళ వారం 3 పసిడి సహా 17 పతకాలు ఖాతాలో సొంతమయ్యాయి. పతకాల పట్టికలో భారత్‌ అయిదో స్థానంలో ఉంది.

అటు భార్య..ఇటు భర్త: కనోయింగ్‌లో ప్రాచి యాదవ్‌ అదరగొట్టింది. రెండు విభాగాల్లో స్వర్ణంతో పాటు రజతాన్ని కూడా సొంతం చేసుకుంది. కేఎల్‌-2 విభాగంలో 54.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచిన ఆమె.. వీఎల్‌-2లో 1 నిమిషం 13.14 సెకన్లలో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల కేఎల్‌-3లో ప్రాచి భర్త మనీశ్‌ కౌరవ్‌ కాంస్యం సాధించాడు. అతడు 44.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు.

గురి తప్పని అవని: టోక్యో పారాలింపిక్స్‌లో పసిడితో మెరిసిన అవని లేఖరా ఆసియా పారా క్రీడల్లోనూ పసిడి పట్టేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో ఆమె 249.6 పాయింట్లతో పసిడి సొంతం చేసుకుంది. హైజంప్‌ టీ63 కేటగిరిలో మూడు పతకాలు భారత్‌కే దక్కాయి. శైలేశ్‌కుమార్‌ (1.82 మీటర్లు) పసిడి సాధించగా.. తంగవేలు (1.80 మీ) రజతం, రామ్‌సింగ్‌ (1.79 మీ) కాంస్యం సాధించారు. ప్రణవ్‌ సూర్మా (క్లబ్‌త్రో), శైలేశ్‌కుమార్‌ (హైజంప్‌, టీ63), నిషధ్‌ కుమార్‌ (హైజంప్‌ టీ47), అంకుర్‌ దామా (5 వేల మీ), ప్రవీణ్‌కుమార్‌ (హైజంప్‌, టీ64), నీరజ్‌ యాదవ్‌ (డిస్కస్‌త్రో), శంకరప్ప శరత్‌ (5000 మీటర్లు) స్వర్ణాలు నెగ్గారు.

మెరిసిన రవి: షాట్‌పుట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు రవి రొంగలి రజతంతో మెరిశాడు. ఎఫ్‌-40 కేటగిరిలో అతడు గుండును 9.92 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. రాంపాల్‌ (హైజంప్‌), ప్రమోద్‌ (1500 మీ), అజయ్‌కుమార్‌ (400 మీ), సిమ్రన్‌శర్మ (మహిళల 100 మీ), రుద్రాంశ్‌ ఖండేవాల్‌ (10 మీటర్ల పిస్టల్‌), యోగేశ్‌ (డిస్కస్‌త్రో), ధరమ్‌వీర్‌ (క్లబ్‌త్రో), కపిల్‌ పర్మర్‌ (జూడో, 60 కేజీ) రజతాలు సాధించారు.

రికార్డుల దీప్తి
తెలంగాణ అథ్లెట్‌ జీవాంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. టీ20 మహిళల 400 మీటర్ల పరుగులో ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడల రికార్డును బద్దలు కొట్టింది. మంగళవారం జరిగిన పరుగును దీప్తి 56.69 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణం పతకం కైవసం చేసుకుంది. కైసింగ్‌ (59 సె- థాయ్‌లాండ్‌) రజతం, కానో నినా (59.73 సె- జపాన్‌) కాంస్యం నెగ్గారు. 2024 పారిస్‌ పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప్తి తన టైమింగ్‌తో.. ఆసియా క్రీడలు (58.55 సెకన్లు), పారా ఆసియా క్రీడలు (58.69 సెకన్లు) రికార్డులను తిరగరాసింది. వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. నాగపురి రమేశ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు ఇంజమూరి శ్యామ్‌ (ఆంధ్రప్రదేశ్‌)కు పతకం చేజారింది. టీ64 పురుషుల హై జంప్‌లో శ్యామ్‌ (1.75 మీటర్లు) అయిదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ప్రవీణ్‌ (2.02మీ- మీట్‌ రికార్డు) స్వర్ణం, రేణు ఉన్ని (1.95 మీ) కాంస్యాలు సాధించారు.