
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం అధికారుల బదిలీ నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సమీక్షలో సున్నితమైన మార్గాలు, ఆయా జోన్లపై చర్చించారు. ఈ ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ పేరిట అధికారులను బదిలీ చేయడం సాధారణమే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, నగదు, డ్రగ్స్, ఉచిత బహుమతుల పంపిణీని నిరోధించాలని ఆయన స్పష్టం చేశారు. ఐదు రాష్ర్టాల పరిధిలో బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, మధ్యప్రదేశ్‌లో రట్లాం, ఖార్గోనే, రాజస్థాన్‌లో అల్వార్, ఛత్తీస్‌గఢ్‌లో రాయిగఢ్, బిలాస్‌పూర్ కలెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ అయిన 25 మంది పోలీస్ అధికారుల్లో 13 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు (జబల్‌పూర్, భిండ్), ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు అదనపు ఎస్పీలు (బిలాస్‌పూర్, దుర్గ్), మిజోరం నుంచి ఇద్దరు (చంపాయి, సైహా), రాజస్థాన్ నుంచి ముగ్గురు (హనుమాన్‌గఢ్, చురు, భీవాడీ) ఉన్నారు.





