News

సూర్యవంశ తిలకుడి ప్రతిష్ఠ వేళ.. సౌర నగరంగా మారనున్న అయోధ్య

447views

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం జనవరి నాటికి ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అదే ముహూర్తానికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. యూపీ కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ-యూపీఎన్‌ఈడీఏ ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 22న జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయోధ్య నగరాన్ని సౌర కాంతులతో నింపే పనులను ఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‘‘సూర్యవంశానికి రాజధాని అయోధ్య. కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుంది’’ అని ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధిదీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్‌ చార్జింగ్‌ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ.. ఇలా సర్వం సోలార్‌ పవర్‌ ఆధారంగానే నడవనున్నాయి.