News

యూరోప్ లో ఘనంగా ప్రారంభమైన శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు

182views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరోప్, యూకేలలోని పలు నగరాల్లో సెప్టెంబర్ ౩౦ వ తేదీ నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కల్యాణోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న ఫ్రాంక్‌ఫర్ట్, అక్టోబర్ 01న ఉట్రేచ్ట్-నెదర్లాండ్స్ లో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

టిటిడి నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఫ్రాంక్‌ఫర్ట్ లో స్వామివారి కల్యాణ వేదికను ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఉట్రేచ్ట్-నెదర్లాండ్స్ లో శ్రీవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన వేల సంఖ్యలో స్వామివారి NRI భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని తిలకించి, భక్తిపరవశంతో పులకించారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది.