
నగదు రహిత వ్యవస్థ ఆవిష్కరణ దిశలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన కార్యాలయంలో డిజిటల్ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని (డీపీఏడబ్ల్యూ) 2023 గవర్నర్ శక్తికాంతదాస్ ప్రారంభించారు. ‘హర్ పేమెంట్ డిజిటల్’ (డిజిటల్‌లోనే ప్రతి చెల్లింపు) పేరుతో కీలక చొరవకు శక్తికాంతదాస్ శ్రీకారం చుట్టారు.
బ్యాంకులు, సంబంధిత అన్ని వర్గాలూ ఆన్‌లైన్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటి ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అభ్యర్థించారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) పేమెంట్ వ్యవస్థ పట్ల ప్రస్తుతం జరుగుతున్న జీ20 దేశాల సమావేశాల్లోసహా పలు దేశాలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థతో సహకారానికి ప్రత్యేకించి ఆయా దేశాల చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లతో యూపీఐను అనుసంధానం చేయడానికి ముందడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ దేశాలతో..: యూపీఐ వ్యవస్థ ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్‌లలో అందుబాటులో ఉంది. యూపీఐ స్వీకరించాలనుకునే 13 దేశాలతో భారత్ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని సమాచారం. ‘యూపీఐ’ – సింగపూర్ భాగస్వామి ‘పేనౌ’ మధ్య లింకేజీలు యాక్టివేట్ అయినప్పటి నుండి, చెల్లింపుల విషయంలో చాలా దేశాలు అటువంటి సహకారంలోకి ప్రవేశించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని దాస్ తెలిపారు.





