News

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు షురూ

217views

మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుత ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం. నాగాలాండ్‌లోని అకులుటో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఖేకాషీ సుమీ బరిలో నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి కజీటో కినిమి గెలుపు ఏకపక్షమైంది. ఇక మేఘాలయలో సోహియాంగ్‌ నియోజకవర్గంలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) అభ్యర్థి హెడీఆర్‌ లింగ్డో మృతిచెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మేఘాయలకు 1972లో తొలిసారి ఎన్నికలు జరగగా.. అప్పటి నుంచి నేటి వరకూ ఎప్పుడూ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈసారి తాము 30 సీట్ల మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ అధికార ఎన్‌పీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా.. 56 సీట్లలో ఎన్‌పీపీ తమ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలపడం గమనార్హం.

మరోవైపు కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ)ల నుంచి కూడా ఆ పార్టీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. కనీసం రెండంకెల స్థానాలను తాము గెలుస్తామని బీజేపీ అంచనా వేస్తుండగా, పాత వైభవాన్ని మళ్లీ సంతరించుకోవాలని కాంగ్రెస్‌ ఆరాటపడుతోంది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 21మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ సైతం మేఘాలయలో తమ పరిధిని విస్తరించాలని ఆశిస్తోంది. 2021 నవంబరులో రాష్ట్రంలో 12మంది కాంగ్రెస్‌ నేతలు టీఎంసీలో చేరడంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇక నాగాలాండ్‌లో కాంగ్రెస్‌, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎ్‌ఫ)లతో కూడిన ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో మరోసారి బీజేపీ, నేషనలిస్టు డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కూటమి గెలవొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఎన్‌పీఎ్‌ఫ 26 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.