News

సత్‌ రవిదాస్‌జీ స్వచ్ఛమైన భగవత్ భక్తులు

388views

స్వచ్ఛమైన భగవత్ భక్తుడు, కుల వివక్షకు పూర్తి విరోధి, సర్వ మానవ సమానత్వాన్ని పరి పూర్ణంగా సమర్థించి అందరికీ మంచి చేసిన ఉదారవాది…… సంత్ రవి దాస్. 1377వ సంవత్సరంలో ఒక చర్మకార కుటుంబంలో బాబా సంతోఖ్ దాస్, మాతా కలసా దేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆ మహనీయుని జీవితం ఎంతో ప్రేరణాత్మకం. సుకుమార స్వభావం, ఉన్నతమైన ఆలోచనా ధోరణి, ఆత్మానుభవం, ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం వంటి లక్షణాలతో మేళవించిన ఆయన …. చేరువలోకి వచ్చే వారందరూ మంత్ర ముగ్ధులయ్యేవారు. నిజాయితీగా.., సదాచారాలతో ఆర్జించిన ధనంతోనే సాధు సంతువులకు సేవ చేసే వారు. బడుగు, బలహీనులను ప్రేమించి…. ఆదరించడం ఆయనకు స్వభావ రీత్యా అలవడ్డాయి. గృహస్థాశ్రమంలో ఉంటూనే నిర్లిప్తంగా, నిర్వికారంగా తామరాకు మీద నీటి బొట్టులా ఉండే వారు. వినయ విధేయతలు పుష్కలంగా వుండేవి. సంత్ రవి దాస్ వ్యక్తిత్వం ఎంత ప్రభావ శీలమైనదంటే….. అగ్రవర్ణాల వారు, బ్రాహ్మణులు సైతం ఆయనను గౌరవించి సత్కరించే వారు. ప్రజల వాడుక భాషలోనే ఆయన తన రచనలు చేసే వారు.

రవి దాస్ కేవలం కవి మాత్రమే కాదు.., విప్లవ కారుడు, విమర్శకులకు కూడా ఆయన వచనాలు సరళంగా.. సులువుగా అర్ధమయ్యే రీతిలో ఉండేవి. సిక్కు మత స్థాపకులు గురునానక్ తో సంత్ రవి దాస్ చర్చలు జరుపుతుండే వారు. వారిరువురూ ఒకసారి వారణాసిలో కలుసుకున్నారని ఆచార్య పృథ్వీ సింగ్ ఆజాద్ పేర్కొన్నారు. అయితే వారి సమావేశం అయోధ్యలో జరిగిందని మరి కొందరు పేర్కొన్నారు. సాధు సంతువుల్లో రవి దాస్ శ్రేష్ఠుడు అంటూ ఆయన పట్ల కబీర్ తన శ్రద్ధాసక్తులు ప్రకటించారు. సిక్కు గురు పరంపరకు చెందిన గురు రామ్ దాస్, గురు అర్జున్ లు …. రవి దాస్ ను ఎంతో గౌరవించే వారు. ఆయన గురించి సిక్కు పవిత్ర గ్రంథం “” గురు గ్రంధ్ సాహిబ్ “” లో ప్రస్తావించడం విశేషం. ఒక పక్క భక్తి భావంతో భక్తులకు పాటలు పాడి వినిపిస్తూనే ….అదే సమయంలో తన వృత్తి ధర్మంగా చెప్పులు కుట్టేవారు. ప్రతి రోజూ అదే ఆయన దిన చర్యగా ఉండేది “అందరికీ ప్రభువు ఒక్కరే అయినపుడు జన్మతో కుల భేదాలు ఎందుకు వస్తాయి. అవన్నీ మిథ్య మాత్రమే” అనే వారు సంత్ రవి దాస్. అదే ….ఆయన ఉన్నత తత్వం. జీవులకు ఏ కులమూ, వర్ణమూ, జాతి ఉండవు. ఋషులు మునులు వర్ణాన్ని కర్మాచరణ కోసం చెప్పారు.మన శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి. జాతి కుల భేదాల గురించి పట్టించుకునే వారు మూర్ఖులు మాత్రమే. నిజానికి…అందరిదీ ఒకటే జాతి అనే వారు సంత్ రవి దాస్. సంత్ రవి దాస్ ను ముస్లింగా మారిస్తే …. ఆయనకు వున్న లక్షలాది మంది భక్తులు కూడా ముస్లిమ్ లుగా మారిపోతారని ఆ నాటి ముస్లిం మత పెద్దలు భావించారు. ఆయన మతం మార్చడానికి పలువురు ముస్లిం మత పెద్దలు…, పలు విధాలుగా ప్రయత్నించారు కానీ….ఆ యత్నాలన్ని విఫలమయ్యాయి. సంత్ రవిదాస్ భక్తి పారవశ్యాన్ని చూసి… ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులు అయ్యారు. ఇలా అయిన వారిలో కాశీ రాజు, చిత్తోడ్ రాజు మహారానా ఉదయ్ సింగ్ భార్య ఇలా ఎందరో ఉన్నారు.