News

నటి అమలాపాల్​కు ఆలయ ప్రవేశం నిరాకరణ.. ఆలయ వర్గాల చర్యను తప్పు పట్టిన హిందూ ఐక్య వేదిక!

307views

కేరళలో ప్రముఖ సినీతార అమలాపాల్​ను గుడిలోకి రానివ్వకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఎర్నాకులంలో తిరువైరానికులంలోని ఓ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె చేసేది లేక గుడి బయటి నుంచే దేవుడిని మొక్కి వెనుదిరిగారు. దీనిపై హిందూ ఐక్య వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపాల్​కు వారి మద్దతును ప్రకటించారు.
ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుడికి వచ్చిన అమలా పాల్​ను.. లోపలికి రాకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డు దగ్గర నుంచే దేవుడికి ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని తిరిగి వెళ్లిపోయారు. “ఆమె క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినందునే గుడిలోకి అనుమతి నిరాకరించాం. ఆలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. గతంలో ఉన్న నిబంధనలనే మేం పాటిస్తున్నాం” అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఆలయ నిర్వహకుల నిర్ణయాన్ని పలువులు విమర్శిస్తున్నారు. హిందూ ఐక్య వేదిక నాయకులు ఆర్​వీ బాబు అమలాపాల్​కు మద్దతిస్తూ ఫేస్​బుక్​లో పోస్ట్​ పెట్టారు. అమలాపాల్​కు గుడిలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. హిందువులు కానివారిని ఆలయంలోకి అనుమతికి నిరాకరించడం వెనుక ఉద్దేశం ఏంటన్నారు. తిరుపతి వంటి దేవాలయాల్లో అనుసరించే ఆచారాలను ఆలయ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకోవాలని ఆర్​వీ బాబు సూచించారు.