
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాజ్‌భవన్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు, డీఎంకేకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలెవ్వరూ రాజ్‌భవన్ ముఖం చూడకపోవడం గమనార్హం. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు గవర్నర్ ఆహ్వానాలు పంపారు. కానీ అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా పాల్గొనలేదు. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివాల్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే డీఎంకే నేతలెవ్వరూ ఈ వేడుకలకు రాకపోవడంతో జార్జ్‌కోట-రాజ్‌భవన్ మధ్య మరింత దూరం పెరిగినట్లయింది. ఇదిలా వుండగా గవర్నర్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన మళ్లీ శనివారం చెన్నై తిరిగిరానున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు ముఖ్యనేతలను కలవనున్నారని, ఈ నెల 9వ తేదీన అసెంబ్లీలో జరిగిన ఘటనపై వివరించనున్నారని ఆ వర్గాలు వివరించాయి. గత కొన్ని రోజులుగా తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య పలు అంశాలపై భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనలేదని చెబుతున్నారు.





