News

ఎన్‌ఐఏకు కోయంబత్తూరు కారు పేలుడు కేసు

393views

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ దేవాలయం వద్ద జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ పేలుడులో మరణించిన నిందితుడు జమేజా ముబిన్ ఇంటి నుంచి దాదాపు 50 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కోయంబత్తూరులో కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఆదివారం ఓ మారుతి 800 కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో జమేజా ముబిన్(25) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు.

ముబిన్ ఇంట్లో నుంచి ఓ గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచీలో పెట్టి కారు వద్దకు వీరంతా కలిసి తీసుకొచ్చినట్టు గుర్తించారు. కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చిక్కుకుని ముబిన్ మరణించగా, మహమ్మద్ డల్గా, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ అనస్ ఇస్మాయిల్‌లను అరెస్టు చేశారు. వీరిపై యూఏపీఏ ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరిని 15 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి