
ఇటీవల కెనడాకు చెందిన భారతీయ మహిళ లీనా మణి మేకలై కాళీమాతపై విడుదల చేసిన పోస్టరు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాళీమాత వేషధారి పొగ తాగుతూ, స్వలింగ సంపర్కుల జెండాను చేతబూని ఆ పోస్టర్లో కనిపించింది. ఆ పోస్టరు ద్వారా దాని ప్రచురణ కర్తలు ఏమి చెప్పదలుచుకున్నారు? ఒక వివాదాన్ని సృష్టించి, తద్వారా లబ్ధి పొందాలన్న తపన దాని వెనుక ఉంది. వాక్, పత్రికా స్వాతంత్ర్యాల ముసుగులో సనాతన ధర్మ ప్రతీకలను, దేవీ దేవతలను అవహేళన చేయడం ఎంతవరకు సబబు? హిందూ దేవీదేవతలను ఇలా అవహేళన చేస్తున్న ‘సృజనాత్మక వాదులు’ ఎందుకు ఇస్లాం, క్రైస్తవ మత విశ్వాసాల జోలికి పోవడం లేదు?
Wendy Doniger వంటి పశ్చిమ దేశాల ఇండాలజిస్టులు హిందూ దేవీ దేవతలను, పవిత్ర గ్రంథాలను అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించినా, కాలం చెల్లిన ఫ్రాయిడ్ భావనల ఆధారంగా రామకృష్ణ పరమహంస యోగ సాధనపై విమర్శలు చేసినా, అందుకు దీటుగా హిందువులు జవాబు ఇవ్వలేక పోవటానికి కారణం వారి ధర్మం బోధించే సహనశీలత తో పాటు సెక్యులర్ రాజ్యాంగం కూడా. పశ్చిమ దేశాల మేథావులు, వినోద పరిశ్రమకు చెందిన వ్యక్తులు అంతులేని సాంస్కృతిక హింసకు పాల్పడుతున్నా హిందువులు చేతకాని వారిలా మిన్నకుండడంతో వారు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు.
హిందూ దేవీదేవతలపై, విశ్వాసాలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. చివరి సారి కూడా కాబోదు. అమెరికాలో బహుళ ప్రజాదరణకు నోచుకున్న టైటానిక్ కామిక్స్ లో కాళీ మాతను ప్రతీకారం తీర్చుకునే గ్రహాంతర జీవిగా చిత్రీకరించారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మత్యాగాన్ని సైతం వారు వక్రీకరించారు. కామిక్స్ లోనూ, చలన చిత్రాలలోనూ కాళీమాతను, హిందువుల పవిత్ర చిహ్నాలను, ప్రతీకలను పాశ్చాత్యులు వారికి ఇష్టం వచ్చినట్లు వక్రీకరించి చిత్రీకరిస్తున్నారు. అజ్ఞానంతోనో, అవగాహనా లోపంతోనో, నిర్లక్ష్యంతోనో ఈ రకమైన వక్రీకరణ జరగటం లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వక్రీకరిస్తున్నారు. అవహేళన చేస్తున్నారు. హిందూ ధర్మం పట్ల వారికి ఉన్న చిన్న చూపు, ద్వేషం కారణంగానే ఇలా జరుగుతోంది. తాము ఎంతగా వక్రీకరించినా, హిందువులు హింసాత్మకంగా స్పందించరన్న నమ్మకంతోనే వారి వక్రీకరణలు మరింతగా కొనసాగుతున్నాయి.
ఆర్మిన్ నవాబీ అనే ముస్లిం నాస్తికవాది కాళీ మాతను ‘సెక్సీ’గా చిత్రీకరించి, ఆమె చాలా ‘హాట్’ అని పేర్కొన్నాడు. ఈ ఉదంతం ట్విట్టర్, మీడియాలలో పెను తుఫాను సృష్టించింది. ‘ఎవరినైనా దూషించటం ఏ మానవుడికైనా జన్మహక్కు’ అని ఆయన వాదిస్తాడు. అయితే ఈ సూత్రం ఇస్లాంకు మాత్రం వర్తించదట. క్రైస్తవ, హిందూ, యూదు విశ్వాసాలను విమర్శించడంలో మాత్రం తప్పేమీ లేదని ఆయన అభిప్రాయం.
1984లో ” ఇండియా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్” అనే చిత్రంలో కాళీమాతను రక్త దాహంతో చిందులేసే రాక్షసిగా చిత్రీకరించారు. నరబలులు కోరుకునే దుర్మార్గపు దేవతగా ఆమెను చూపించారు. 2010లో ” సూపర్ నాచురల్” అనే టీవీ సిరీస్ లో కాళీమాతను, వినాయకుడిని అసభ్యంగా చిత్రీకరించారు. వారి దేవదూతలు అయిన గేబ్రియల్, బల్దార్ లతో ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టారు. బైబిల్ దేవుడి చేత శపించబడ్డ లూసిఫర్ వినాయకుడిని ఓడిస్తాడు. క్రైస్తవంలో ఎందుకూ కొరగాని వారి చేతిలో ఓడిపోయే శక్తి హీనులు హిందూ దేవీదేవతలు అని చెప్పటమే వారి ఉద్దేశ్యం. పాశ్చాత్యుల జాత్యహంకారానికి, మత మౌఢ్యానికి పరాకాష్ట ఈ నీచ చిత్రీకరణ.
2012లో వచ్చిన SMITE అనే ఓ ఆన్లైన్ వీడియో గేమ్ లో వివిధ తెగలకు చెందిన దేవుళ్ళ పాత్రలు పోషించవచ్చు. అందులో హిందూ, గ్రీక్, చైనీస్, ఈజిప్షియన్, నార్స్ సంస్కృతులకు చెందిన దేవీదేవతలే ఉన్నారు తప్ప అబ్రహామిక్ మతాలకు చెందిన ఒక్క దేవుడు గానీ, దేవదూతలు గానీ, సైతాను గానీ లేరు. 2014 లో TBS మిడ్ నైట్ షోలలో చారిత్రిక స్త్రీలతో టైం మెషిన్ ను ఉపయోగించి సంభోగించవచ్చు. ఘోరమైన విషయమేంటంటే… అందులో కాళీమాతను కూడా చూపారు. 2015లో ఫాక్స్ షో “Sleepy Hollow” లో మనిషి నరరూప రాక్షసుడుగా మారటానికి ప్రేరణ కలిగించేదిగా కాళీమాత విగ్రహాన్ని చూపారు.
పశ్చిమ దేశాల సినిమాలు, టీవీ షోలు, కామిక్స్ లలో మన దేవీ దేవతలను ఎంత అవమానకరంగా చిత్రీకరిస్తున్నారో తెలుసుకోవడానికి పైన పేర్కొన్న ఉదాహరణలు చాలు. అయితే ఇదేదో వినోద పరిశ్రమకే పరిమితమైన జబ్బు కాదు. పాశ్చ్యాత్య క్రైస్తవ మేథావుల నుండి ఈ జబ్బు వినోద రంగానికి పాకింది.
మహాశివుని ఆరాధనను కూడా వారు అదే విధంగా వక్రీకరించారు. ‘లింగం’ అంటే సరైన అర్థం తెలియనివారు లింగ పూజను ‘పురుషాంగ పూజ’ గా అభివర్ణించి, అవహేళన చేసి ఆనందిస్తుంటారు.
1996లో ప్రొఫెసర్ నరసింహ తన ఉపన్యాసంలో ఈ అమెరికన్ మేథావుల కుత్సితాన్ని, జుగుప్సాకరమైన వారి ఆలోచనలను బట్టబయలు చేశారు. ” 80 ల చివర నుండి, 90 ల ప్రారంభం నుండి ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైంది. కలకత్తా కాళీ మాతను స్వేచ్ఛా ఆలోచనల, స్వేచ్ఛా వ్యక్తీకరణల బలిపీఠం వద్ద బలి చేశారు. వారి వ్రాతలలో ఆమెను పరమ వికృతంగా అభివర్ణించారు.” అని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ నుండి తీసుకున్న కొన్ని పంక్తులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అత్యంత జుగుప్సాకరమైన, వికృతమైన ఆ వ్రాతలు యావత్ హిందూ సమాజానికీ అవమానకరం.
ఒక ధర్మాన్ని ఆచరించే ప్రజల నుంచి అనాదిగా పూజలు అందుకుంటున్న ఒక స్త్రీ దేవతను ఆ విధంగా కించపరచి, అవహేళన చేసి, అపహాస్యం చేసి, అసభ్యంగా చిత్రీకరించే వారికి హిందూ ధర్మం పట్ల, విశ్వాసాల పట్ల, ప్రతీకలపట్ల ఎలాంటి అభిప్రాయముందో చూడండి. వారి దృష్టిలో కాళీమాత, రక్తాన్ని ఇష్టపడే రక్త పిపాసి మాత్రమే కాదు, ఒక విశృంఖల నడవడి కలిగిన స్త్రీ. ఎంత అన్యాయపు భావనలు? ఇంత జరుగుతున్నా హిందూ సమాజం పాశ్చాత్య క్రైస్తవ లోకం పాల్పడుతున్న ఈ విపరీత, జుగుప్సాకరమైన దైవదూషణను చేష్టలుడిగి చూస్తూ ఉండడం కూడా అత్యంత బాధాకరం, అవమానకరం.
సర్వ శక్తి స్వరూపిణి కాళీమాత :
మన సంప్రదాయంలో ప్రతి రూపం వెనుక, సంకేతం వెనుక గూడార్థం ఒకటి ఉంటుంది. పైకి కనిపించే రూపం వెనుక దాగి వున్న భావనను అర్థం చేసుకోకుండానే రూప చిత్రాన్ని బట్టి అత్యంత కువ్యాఖ్యానాలు శతాబ్దాల తరబడి పాశ్చాత్యులు కావాలనే చేస్తూ వస్తున్నారు. కాళీమాత ఇచ్చే సందేశం వేరు. ఈ తెల్ల వెధవలకు అర్థమైంది వేరు. అర్థమైనా, వారు వక్రీకరణ చెయ్యదలుచుకున్నారు కనుక, వివిధ మార్గాలలో ఆ వక్రీకరణలకు పాల్పడుతున్నారు.
‘కాళి’ అంటే సమయం లేదా చలనం అని అర్థం. కాలానికి ఆది, అంతం లేవు. సమస్త ప్రాణికోటి అనంత కాలగమనంలో పుట్టి, పెరిగి నశిస్తూ ఉంటుంది. విశ్వం పుట్టుకకు, లయానికి కారణభూతురాలైన కాళీమాత ప్రకృతిలో వచ్చే అన్ని మార్పులకు, జీవుల అన్ని వ్యక్తీకరణలకు మూలం. అన్నిటికీ ఆమె ఆది. ఎంతో పురాతనమైనది. ఆమె రంగు కారు నలుపు. నలుపు రంగు అన్నిటినీ శోషించినట్లు కాళీమాత ప్రకృతిని శోషింపజేయగల శక్తి కలదని చెప్పటానికి సంకేతంగానే కాళీమాతను నల్లగా చూపించారు.
కాళీమాత నాలుక తెరిచినట్లుగా చూపబడుతుంది. తాంత్రిక సాధనలో అది ఒక దశ. ఆమె నాలుగు చేతులలో ఒక చేతిలో కత్తి ఉంటుంది. మరొక చేతిలో తెగిన తల ఉంటుంది. తెగిన తల అరిషడ్వర్గాలకు నిలయం. ఆ అరిషడ్వర్గాలు నశించినప్పుడు మాత్రమే ఆమెను చేరగలుగుతాం. మిగిలిన రెండు చేతులతో అభయం, ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా చిత్రీకరించారు. అహంకార, మమకారాలను త్యజించగలిగితే అమ్మ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అందుకు ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతామని ఆమె అభయం ఇస్తున్నది.
ఆమె నగ్నంగా స్మశానంలో ఉన్నట్లుగా చూపబడుతుంది. వస్త్రం అనేది శరీరాన్ని కప్పి ఉంచేది. ఆమెది విశ్వ శరీరం. దాని బయట ఏమీ లేదు. అందుకే ఆమె నగ్నంగా సంచరిస్తున్నట్లు చూపారు. అవ్యక్తమైన మూల రూపం కారణంగా రూపం లేదు.
అంతేకాక వస్త్రం సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక అనుకుంటే వాటిని అధిగమిస్తే, గుణాతీత స్థితి వస్తుంది. నగ్నత్వం గుణాతీత స్థితికి ప్రతీక తప్ప లైంగికతకు కాదు. ఆమె నోటి నుండి కారే రక్తం, శుద్ధి ప్రక్రియ ఆవశ్యకతను తెలియజేస్తుంది. కుండలినీ యోగలో రక్త శుద్ధి, ప్రాణ శుద్ధి అత్యంత ప్రాధాన్యం గల క్రియలు. రక్తాన్ని, ప్రాణాన్ని కూడా శుద్ధి చేయగలిగేది అమ్మ. తెగిన తలలు మన అహంకార, మమకార చిహ్నాలు. తెగిపడిన చేతులు మన కర్మలకు ప్రతీకలు. ఆమె మన కర్మలను /చేతలను, చేతులను నరికి వేయగలదు. అహంకార, మమకారాలను తెగవేయగలదు. అహంకార మమకారాలు నుండి, నానావిధ కర్మల నుండి విముక్తి చేయగలదు. కర్మలకు బానిసలైన జీవుల బానిసత్వాన్ని ఆమె మాత్రమే పోగొట్టగలదు. ఆధ్యాత్మిక అభ్యాసకులు వారి కర్మలను ఒక్కొక్కటిగా మాతకు అర్పణ చేసుకుంటూ వస్తేనే, వారికి మోక్షం సిద్ధిస్తుంది.
మనం వివిధ జన్మలలో, వివిధ శరీరాలతో అనేక కర్మలు చేస్తూ వచ్చాం. ఒక వ్యక్తి మోక్షాన్ని పొందటానికి ముందు వివిధ శరీరాలతో వందల కొద్దీ జీవితాలను అనుభవించటానికి ప్రతీకగా పుర్రెల దండను ఆమెకు ధరింపజేశారు. నిశ్చల స్థితిలో నేలపై పడుకున్న శివుని ఛాతిపై తన కాలును పెట్టి ఉన్నట్టు ఆమెను చిత్రీకరిస్తారు. చలన రహితుడైన శివునికి చైతన్యాన్ని కలిగించే కాళీమాతగా, శివశక్తుల సంయోగమే ఈ సృష్టి అని చెప్పటానికి ఆ ప్రతీకాత్మక చిత్రం గీయబడింది.
అమ్మ చూపిన మార్గంలోనే దైవ ద్రోహులను శిక్షిద్దాం….
హిందువులు భక్తిశ్రద్ధలతో నిత్యం కొలిచే అమ్మవారిని అపహాస్యం, అవహేళన చెయ్యటం, జుగుప్సాకరంగా వర్ణించటం, చిత్రీకరించటం దైవదూషణ కిందకు వస్తుంది. ఇతర మతాలలో దైవదూషణకు ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో, హిందూ దేవీ దేవతలను దూషించే వారికి కూడా అలాంటి శిక్షలే విధించాలి. పాశ్చాత్య మేథావులు, వినోద పరిశ్రమ క్షమించరాని దైవ దూషణలకు పాల్పడుతున్నారు. మన తాంత్రిక సంప్రదాయాలను ఆధ్యాత్మిక మూఢనమ్మకాలుగా కొట్టి వేసే హక్కు వారికి ఎవరిచ్చారు? హిందూ దేవీదేవతలకు, పవిత్ర చిహ్నాలకు, రూపురేఖలకు ఎన్నడూ ఉనికిలో లేని, వికృతమైన, జుగుప్సాకరమైన వర్ణనలు చేయటం దైవదూషణ మాత్రమే కాదు, దైవ ద్రోహం కూడా. అందుకు వారు నిందార్హులు మాత్రమే కాదు, కఠిన శిక్షార్హులు కూడా.
అసలు పాశ్చాత్యుల ఈ అన్ని ప్రయత్నాల వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. హిందూ సమాజాన్ని శక్తి ఉపాసన నుంచి దూరం చెయ్యడం ద్వారా హిందువులను శక్తి హీనులుగా చెయ్యడమే వారి ప్రధాన ఉద్దేశ్యం. హిందువులను వీరత్వానికి, ప్రతీకారేచ్ఛకు, పోరాట పటిమకు దూరం చెయ్యడమే వారి అసలుసిసలు లక్ష్యం. ఇప్పటికైనా నిజం తెలుసుకుందాం. ఇచ్చ, జ్ఞాన, క్రియా శక్తులకు మూలమైన అమ్మను ఉపాసిద్దాం. బాహ్య, అంతః శక్తులను సాధిద్దాం. దుర్మార్గుల పట్ల అమ్మ చూపిన మార్గంలోనే నడుద్దాం. వారి దుష్ట యత్నాలను అంతం చేద్దాం.





