
జలంధర్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) ఫ్యాకల్టీ సభ్యురాలు అవమానించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెడుతుండటంతో ఎల్‌పీయూ స్పందించింది. శ్రీరాముడిని అవమానించిన ఫ్యాకల్టీ సభ్యురాలిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు, తాము లౌకికవాదంతో వ్యవహరిస్తున్నట్టు వివరించింది.
ఫ్యాకల్టీ సభ్యురాలు గుర్‌సంగ్ ప్రీత్ కౌర్ విద్యా బోధనలో భాగంగా శ్రీరాముడిని అవమానిస్తూ మాట్లాడినట్టు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆమె విద్యా బోధనలో భాగంగా మాట్లాడుతూ, ‘‘నిజానికి శ్రీరాముడి మనసు మంచిది కాదు. రాముడు ఎంతమాత్రం మంచి వ్యక్తి కాదు. రావణాసురుడు మంచివాడు. రాముడు జిత్తులమారి అని గుర్తించాను. సీతను చిక్కుల్లో పెట్టడానికి ఆయన ఈ ప్రణాళిక రచించాడు. సీతను ఇబ్బందుల్లోకి నెట్టాడు, రావణుడి మీదకు నిందను తోసేశాడు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో నేను ఎలా నిర్ణయించగలను? ప్రపంచమంతా రాముడిని ఆరాధిస్తోంది, రావణుడు మంచివాడు కాదంటోంది’’ అని ఆమె చెప్పారు.
జలంధర్‌లోని ఎల్‌పీయూ స్పందిస్తూ, ఓ ఫ్యాకల్టీ మెంబర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటుండగా చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన కొందరు బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ఆమె వ్యక్తిగతమైనవని స్పష్టం చేస్తున్నట్టు వివరణ ఇచ్చింది.
ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో దేనినీ ఎల్‌పీయూ సమర్థించదని పేర్కొంది. ఇది సెక్యులర్ విశ్వవిద్యాలయమని పేర్కొంది. అన్ని మతాలవారినీ సమానంగా ప్రేమతో, గౌరవంతో చూస్తామని వివరించింది. ఆమెను తక్షణమే అమలయ్యే విధంగా విధుల నుంచి తొలగించినట్టు తెలిపింది. ఈ మొత్తం సంఘటన పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామంది.
Source: Nijamtoday





