
* కృష్ణా జిలాలో దారుణం
*బట్టలూడదీసి, ఘోరంగా కొట్టి, చిత్రహింసలు పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి
అనుమానం పెనుభూతమైంది. అగ్రకుల అహంకారం బుసలు కొట్టింది. రాజకీయ అండదండలు అడ్డూ అదుపు లేకుండా చేసింది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక అబలలపై అమానుషంగా ప్రవర్తించేలా చేసింది.
మార్చి 8, 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఇద్దరు అమాయక మహిళలపై చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన కొందరు చేసిన అమానుషమైన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నందిగామకు చెందిన కళ్యాణం దుర్గ, గంటా దుర్గ అనే దాసరి కులానికి చెందిన సంచార జాతి మహిళలు ఇద్దరూ చుట్టుపక్కల గ్రామాలలో ఇంటింటికీ తిరిగి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అమ్ముతూ ఉంటారు. ఆ క్రమంలో 8/3/2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారు కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి వెళ్లారు. వ్యాపారం పూర్తిచేసుకుని నందిగామకు తిరుగు ప్రయాణమవడం కోసం బస్టాండ్ కు చేరుకున్నారు. ఇంతలో అక్కడికి కొందరు వ్యక్తులు బైకులు వేసుకుని వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న మహిళలిద్దరినీ బలవంతంగా బైకులపై ఎక్కించుకుని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకం నిమిత్తం ఈ ఇరువురు మహిళలు తమ ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత తమ ఇంటిలోని బంగారు గొలుసు ఒకటి కనిపించకుండా పోయిందని, దానిని వీరిద్దరే దొంగిలించి ఉంటారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. చైను ఎక్కడ దాచారో చెప్పమంటూ మహిళలిద్దరిపైనా చేయి చేసుకున్నారు. రోడ్డు మీదే బహిరంగంగా వారి బట్టలు విప్పదీసి వళ్లంతా తడుముతూ చైన్ కోసం వెదికారు. అనంతరం మహిళలిద్దరినీ ఇంటిలోకి తీసుకెళ్లి చెరొక గదిలో ఉంచి విచారించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆ మహిళలను దారుణంగా కొట్టారు. వారిలో ఒక మహిళ బహిష్టు అయి ఉన్నది అని చెప్తున్నా కూడా వినకుండా ఆమె లోదుస్తులు కూడా తొలగించి మరీ చైను కోసం వెదికారు. చెప్పుకోలేని చోట కారం అద్దబోయారు. అట్లకాడ కాల్చి వాతలు పెట్టబోయారు. భయ భ్రాంతులకు గురైన మహిళలు తమను వదిలిపెట్టమంటూ కాళ్లావేళ్లా పడి వేడుకున్నా కనికరించలేదు. ఏడుస్తూ, అరుస్తూ తలుపులు బాదుతున్నా చుట్టుపక్కల వారెవరూ వారిని రక్షించడానికి ముందుకు రాలేదు సరికదా చోద్యం చూస్తూ చుట్టూ నిలుచున్నారు. వారు కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాల పాలై స్పృహ తప్పిన మహిళ నటిస్తున్నదని ఆరోపిస్తూ జుట్టు పట్టుకుని పైకి లేపి మళ్లీమళ్లీ కొట్టారు. కాలితో కడుపు మీద తన్నారు.
ఇంతలో విషయం తెలుసుకున్న వారి బంధువు ఒకరు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చారు. పోయిందనుకుంటున్న గొలుసు ఇంట్లోనే ఎక్కడైనా ఉన్నదేమో చూడమని ఆ ఇంట్లోని వారికి పదే పదే చెబుతూ ఉన్నా వారెవరూ వినిపించుకోలేదు. ఆ పెద్దాయన మరలా మరలా అదే విషయాన్ని చెబుతూ ఉండడంతో ఎట్టకేలకు వెళ్లి ఇల్లంతా వెదికారు. చివరికి ఆ గొలుసు వారికి వారి ఇంట్లోని ఒక పప్పుల డబ్బాలోనే దొరికింది.
దాంతో నిర్ఘాంతపోయిన సదరు పెద్దమనుషులు ఈ విషయం ఎక్కడైనా చెబితే మీ ప్రాణాలు పోతాయంటూ ఆ మహిళలిద్దరినీ తీవ్రంగా బెదిరించారు. తమకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఎవరూ ఏమీ చెయ్యలేరని, మిమ్మల్నిద్దరినీ ఇక్కడే చంపి పాతిపెట్టినా అడిగే దిక్కులేదని ఆ మహిళలిద్దరినీ తీవ్రంగా దుర్భాషలాడుతూ బెదిరించారు.
మహిళలిద్దరూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి భోరుమన్నారు. కుటుంబ సభ్యులు, సాటివారి ప్రోద్బలంతో పోలీస్స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టబోతే పోలీసు వారు ఎఫ్ ఐ ఆర్ రాయడానికి నిరాకరించారు. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారిలో ఒక మహిళ అయితే సుమారు 20 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందవలసి వచ్చిందంటే వారిపై ఎంత దారుణంగా దాడి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. జరిగిన అవమానంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధిత మహిళలిద్దరూ ఇప్పటికి రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
జరిగిన దారుణాన్ని తెలుసుకున్న సంచార జాతుల అభివృద్ధి మండలి (AIDNTDC) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ A.R. వెంకట్, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోరంట్ల శ్రీనివాసరావులు 31/3/2022 నాడు బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన AIDNTDC నాయకులిద్దరూ జరిగిన దారుణాన్ని విని చలించిపోయారు.
అమాయక సంచారజాతుల వారికి భవిష్యత్తులో ఇలాంటి అమానుష, అవమానకర అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారికి స్థిరమైన వ్యాపార అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని వారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జరిగిన అమానుష ఘటనను వివరిస్తూ సంచారజాతుల అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ కు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖకు మరియు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయా సంస్థల తదుపరి చర్యల కోసం బాధితులు, సంఘాల నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఆపమని AIDNTDC నాయకులు స్పష్టం చేస్తున్నారు. అటు అధికార పార్టీ నాయకులు, ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇరువురూ అమాయక అబలలపై దౌర్జన్యానికి పాల్పడ్డ అగ్రకుల అహంకారులకే అండగా నిలవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరుగుతుందని, సంచార జాతుల వారు గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు ఇకనైనా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.
 
			




