News

చైనా వస్తువులను కొనడం, తినడం, వాడడం మన జాతికి హానికరం, మన దేశానికి ద్రోహం.

984views

మకర సంక్రాంతికి మరో పేరు ‘పతంగ్’ల- గాలిపటాల- పండుగ.. మకర సంక్రాంతి పండుగకూ గాలిపటాలకు అవినాభావ సంబంధం ఉండడం తరతరాల కథ. మన దేశంలోని ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలలో అత్యధిక శాతం చైనాతో ముడివడి ఉండడం నడుస్తున్న వ్యథ.. చైనా గాలి పటాలకున్న దారం- మాంజా- స్వదేశంలో తయారైన గాలి పటాలను కోస్తోంది, తెగిన మన గాలిపటాలు కూలిపోతున్నాయి. ఈ ‘పతంగ్’లను, దారాన్ని తయారుచేస్తున్న కుటీర పరిశ్రమలు దేశవ్యాప్తంగా మూతపడి పోతున్నాయి! చైనాలో తయారవుతున్న గాలిపటాలు- పతంగ్‌లు-, వాటిని ఎగుర వేయడానికి అవసరమైన చైనా ‘దారం’- మాంజా- మన దేశానికి దిగుమతి కాకుండా మన ప్రభుత్వం నిషేధించక పోవడం ఈ స్వదేశీయ వైపరీత్యానికి మూల కారణం! ‘దిగుమతి’ని పూర్తిగా నిషేధించకుండా ‘వాడకాన్ని’ మాత్రం నిషేధించడం వల్ల చైనా గాలిపటాలు, చైనా ‘మాంజా’ మన దేశపువిపణి వీధుల నుంచి తొలగిపోవడం లేదు. ఫలితంగా వందల ఏళ్లుగా ‘పతంగ్’లను తయారుచేస్తున్న భారతీయులు, చిట్టిపొట్టి ఉత్పత్తిదారులు, గృహపరిశ్రమల వారు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. ఇలా మూసివేస్తున్న ఉదంతాలు నాలుగైదు ఏళ్లుగా ప్రచారం అవుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిరోధక చర్యలను చేపట్టిన జాడ లేదు.

చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను పావురాల గొంతులను కోస్తోందని 2013నుంచి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని కూడ ప్రచారమైంది. ఈ దారం- మాంజా- గాలిపటాల- పతంగ్‌ల-ను ఎగురవేయడానికై ఉపయోగపడుతోంది. ఈ దారం ఉపయోగించినట్టయితే గాలిపటాలు ఆకాశంలోకి బాగా దూసుకొనిపోతాయన్న భ్రమ వ్యాపించి ఉంది! అందువల్ల మన దేశంలో తరతరాలుగా తయారవుతున్న ‘పత్తిదారాన్ని’ వద్దని, చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారాన్ని జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా ‘దారం’లో గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలుపుతున్నారట! అందువల్ల ఈ ‘దారం’ కత్తిలాగా మారుతోందట.

‘పతంగ్’లను ఎగురవేసేవారు తమ ‘పతంగ్’ మిగిలినవారి గాలి పటాలకంటె ఎత్తున ఎగరాలని భావించడం సహజం! అంతవరకు బాగుంది. కానీ తమ గాలిపటంతో పోటీపడి పైకి లేచే ఇతరుల గాలిపటాలను కూల్చివేయడం ‘ఆట’లో భాగమైపోయింది. అందువల్ల తమ గాలిపటానికున్న ‘దారం’తో ఇతరుల గాలిపటాలను ఎగిరించే దారాలను కోసివేయాలి, అప్పుడు ప్రత్యర్థుల గాలిపటం కూలిపోతుంది.

ఈ పోటీ ఆట ‘ధర్మయుద్ధం’వలె నూలు దారంతో మాత్రమే జరగడం తరతరాల క్రీడా చరిత్ర. స్వదేశీయ గృహపరిశ్రమలవారు ‘నూలు’తో మాత్రమే గాలిపటాల దారాన్ని తయారుచేశారు. వృక్ష నిర్యాసాలతోను ఇతరమైన అటవీ ఉత్పత్తులతోను మాత్రమే దారానికి పదనుపెట్టారు, పెడుతున్నారు. గాలిపటాలను సైతం కాగితాలతోను అటవీ ఉత్పత్తులతోను మాత్రమే స్వదేశీయులు రూపొందిస్తున్నారు. మన దేశంలోని కుటీర పరిశ్రమలవారు తయారు చేసిన, చేస్తున్న ‘పతంగ్’లవల్ల, ‘దారం’వల్ల పర్యావరణం పాడు కాలేదు, పావురాలు పక్షులు గాయపడలేదు. ప్రకృతిని పరిపోషించడం, పెంపొందించడం భారతీయుల జీవన విధానం. కానీ చైనానుంచి వస్తున్న గాజుపెంకులతోను ప్లాస్టిక్‌తోను రసాయన విషాలతోను నిండిన దారాలు, గాలిపటాలు ప్రకృతిని గాయపరుస్తున్నాయి. ఈ ‘ప్లాస్టిక్’ విషాల దారంతో ప్రత్యర్థుల గాలిపటాలను సులభంగా కూల్చవచ్చునన్న భ్రమతోను, తమ గాలిపటాన్ని పైపైకి ఎగిరించవచ్చునన్న అత్యాశతోను మన జనాలు చైనా దారాన్ని, చైనా గాలిపటాలను కొనేస్తున్నారట!

మకర సంక్రాంతి ముందురోజున, 2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, నిలువ ఉంచడాన్ని నిషేధించింది. ఈ దారం వల్ల పక్షులు, పావురాలు బలికావడం, బాలబాలికలు గాయపడడం ఆ నిషేధానికి నేపథ్యం. ఆ తరువాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ఈ దారాన్ని నిషేధించాయి. 2017 జూలైలో ‘జాతీయ హరిత న్యాయ మండలి’-నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి-వారు దేశవ్యాప్తంగా చైనా ‘మాంజా’ను నిషేధించారు. కానీ గత ఏడాది మకర సంక్రాంతికి ముందు ‘మాంజా’తోపాటు గాలిపటాలు కూడ చైనానుండి వెల్లువెత్తాయి! దేశంలో తయారవుతున్న ‘దారం’ఉండ ఇరవై రూపాయలకే లభిస్తోంది. కానీ ఎనబయి రూపాయలకు ‘ఉండ’- బండిల్- చొప్పున చైనా దారాన్ని మనం కొంటున్నాము. హైదరాబాద్‌లోను ఇతర చోట్ల తరతరాలుగా గాలిపటాలు రూపొందించిన స్వదేశీయ ఉత్పత్తిదారులు దుకాణాలు మూసి వేస్తున్నారు.. ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్నారు! నిరోధించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధ ఉందా?

చైనా 1962లో మన ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచింది, భౌతికంగా దురాక్రమించింది. ఇప్పటికీ దాదాపు యాభై వేల చదరపు కిలోమీటర్ల మన భూమి చైనావారి అక్రమ అధీనంలో అలమటిస్తోంది. అందువల్ల చైనా మనకు శత్రుదేశం. చైనా వస్తువులను కొనడం తినడం వాడడం మన జాతికి హానికరం, మన దేశానికి ద్రోహం. ప్రభుత్వాల చర్యల మాటల వున్నా భారతీయులుగా మనం ఈ సంక్రాంతి సందర్భంగా “చైనా ఉత్పత్తులను వాడబోమని” ఒక దృఢ సంకల్పం చేసుకుందాం.చైనా ఉత్పత్తుల వినిమయాన్ని మాని స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుదాం. స్వదేశీ ఉత్పత్తిదారులను కాపాడుకుందాం. వారిని ప్రోస్చహిద్దాం. అండగా నిలుద్దాం. విదేశీ దురాక్రమణదారుల నుండి మన దేశాన్ని కాపాడుకుందాం.