
భారత్-పాక్ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్ కు అందించింది. ఇస్లామాబాద్ లో ఉన్న భారత హైకమిషన్ కు పాక్ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. 2008 మే 21 జరిగిన కాన్సులర్ యాక్సిస్ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఖైదీల వివరాలను అందిస్తారు. మరోవైపు భారత్ కూడా ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కు 340 మందితో కూడిన జాబితాను అందించింది. ఇందులో 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ సమాచార మార్పిడిని కొనసాగిస్తున్నారు.
అణ్వాయుధాల వివరాలు కూడా….
గత 30 ఏళ్లుగా భారత్ పాక్ మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లోని అణ్వాయుధాల వివరాలను శుక్రవారం పరస్పరం సమర్పించాయి. ఇరు దేశాల మధ్యనున్న వైరం కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయగా 1991, జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. మొదటిసారిగా ఈ వివరాలను 1992 జనవరి 1 నుంచి పరస్పరం మార్చుకోవడం ప్రారంభించాయి.
 
			




