బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకున్న ఎస్. ఐ – గ్రామస్తుల ఆగ్రహంతో తిరిగి అనుమతి ఇచ్చిన డీ. ఎస్. పి

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గ్రామంలోని మహిళలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ ఆడుతుండగా వీరులపాడు ఎస్ ఐ హరి ప్రసాద్ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మహిళలు బతుకమ్మ ఆడుతున్నారంటూ ఆ కార్యక్రమాన్ని ఆపించాడు.
తాము ప్రతి ఏడాదీ జరుపుకునే ఉత్సవాలలో భాగంగానే ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నామని, అందులో భాగంగానే బతుకమ్మ ఆడుతున్నామని, కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకునే పరిమిత సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నామని అక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలు, గ్రామ పెద్దలు ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా “నేను ఇక్కడే ఉంటాను, బతుకమ్మ ఎలా ఆడతారో చూస్తాను” అంటూ ఎస్ ఐ భీష్మించుకు కూర్చున్నాడు. ఎస్ ఐ కు నచ్చచెప్పాలని చూసిన గ్రామస్తులను బెదిరించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన గ్రామస్తులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది.
విషయం తెలుసుకున్న రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి జయంతి గ్రామాన్ని సందర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర మతాల కార్యకలాపాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించే ప్రభుత్వ అధికారులు, పోలీసులు హిందూ పండుగలు, ఉత్సవాల విషయం వచ్చేసరికి ఇలా దుందుడుకుగా వ్యవహరించటం సరికాదని, ఇది హిందూ ధర్మాన్ని కించపరిచటమేనని, ఇది ఏమాత్రమూ సమంజసం కాదని, అధికారుల పక్షపాత ధోరణిని సహించేది లేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనల నేపథ్యంలో హిందూ సమాజంలో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, ఈ రకమైన ప్రవర్తనను ప్రభుత్వ వర్గాలు, అధికారులు మానుకోకుంటే భవిష్యత్తులో వారంతా హిందూ సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వారిని హెచ్చరించారు.
దీంతో సీఐ, డి.ఎస్.పి లు గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని పరిస్థితులు పరిశీలించారు. గ్రామ పెద్దలతో మాట్లాడి వారిని సముదాయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ పండుగను నిరభ్యంతరంగా చేసుకోవాల్సిందిగా డి.ఎస్.పి గ్రామస్తులకు తెలియజేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దుందుడుకుగా వ్యవహరించిన ఎస్ ఐ హరిప్రసాద్ పై తగు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు డి.ఎస్.పి హామీ ఇచ్చారు.
 
			




