ArticlesNews

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి

1.4kviews

మంచిమాటలు, సత్సంకల్పములూ మరలమరల స్మరించుకోవాలి. ఈరోజు కళాప్రపూర్ణ గుఱ్ఱం జాషువా జన్మదినం.

ముసాఫరులు కావ్యంలో జాషువా చైనాయుద్ధాన్ని ప్రస్తావించారు. మాతృదేశరక్షణకోసం చైనాతో పోరాడి అమరుడైన జీవుడు ఊర్ధ్వముఖ ప్రస్థానక్రమంలో భాగంగా చంద్రమండలసమీపంలో సేదదీర్చుకొన్నట్టు జాషువా పేర్కొన్నారు. యుద్ధంలో మరణించిన వీరుడు సూర్య మండలాన్ని ఛేదించుకొని ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి ముక్తుడౌతాడని భారతీయుల విశ్వాసం. చైనీయ రుధిర నిర్ఝరుల జలకమాడి భారతీయకరవాలము విజయం సాధించేవరకు జాతికి శాంతి లభించదని జాషువా భావించారు.

చైనీయ రుధిర నిర్ఝరుల స్నానముచేసి

భరత సైనిక కోటి మరలుదాక,

కుటిల నీతిజ్ఞుల గురుకపాలములతో

అభవుండు తాండవ మాడుదాక,

పగవాని క్రొవ్వుతో బసవశంకరమౌళి

నిలయాన దివ్వెలు వెలుగుదాక,

భారతీయుల భుజబల శౌర్యసంపత్తి

పంచఖండము లాక్లమించుదాక,

 

హైందవ మహోర్వి సరిహద్దు లాక్రమించి

కాలుమోపిన కుటిలముష్కరుని శిరము

మంచుమలమీద దృష్టికెత్తించుదాక

నిద్రపోవదు భారత భద్రకాళి!

ఒక ఏడాది క్రితంవరకు కవులు ఆతిశయోక్తులు బాగాచెప్తారు, వాటిల్లో ఇదొకటి అనుకున్నవారిలో మనం చాలా మందిమి ఉండి ఉంటాం. కానీ కవివాక్కు ఎంతబలమైనదో చూడండి. భారతీయ సైనికులతో తలపడడానికి భయపడుతూ చైనా సైనికులు హడిలిపోతున్న దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నాం గదా?

భారతదేశాన్ని చూసి మనమందరమూ ఎలా గర్వించాలో, జాషువాగారు మనకు తెలియజెప్పిన ఒక పద్యం పరిశీలించుదాం.

బహుదేశములను పేర్వడసి మీసముదీటు

భరతఖండమ్ము నా పాఠశాల

స్తనయుగంబున గాన సాహిత్యములు గల్గు

భాషావధూటి నా పంతులమ్మ

సాందీపని సమక్షమందు విద్యగడించు

వనమాలి నా సహపాఠకుండు

భక్తివైరాగ్యభావనల తావలయైన

భాగవతమ్ము నా బాలశిక్ష

గంటము ధరించి మోహనాక్షరము లెనయ

ప్రతిఫలించెడి నా మహోన్నత విభూతి

వ్రాసికొందును దశదిశా ఫలకపంక్తి

గడన కెక్కిన ఆంధ్ర పుత్రుడను నేను.

జాషువా కవియొక్క దేశభక్తి ‘జాతీయాభిమానం, ఆంధ్రదేశాభిమానం, అస్పృశ్యతా నిరసన, ఆర్థికదోపిడీ ఖండన, పాలక నియంతృత్వంపై పోరాటం, అచ్చమైన దేశనాయక ప్రశంస’ అనే ఆరు సోపానాలను ఆశ్రయించింది…

ఆయన రచించిన ఖండికలలో పెక్కుచోట్ల ‘నాదు జాతి, నాదేశము, నాదు భాష’ అనే దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది.అఖండ గౌతమి, రచ్చగెలుపు, రాజ దర్శనం, తెలుగువెలుగు, తెలుగుగడ్డలు మున్నగు ఖండికలు స్వీయ రాష్ట్రాభిమానాన్ని చాటుతాయి. అన్నీ చివర జాతీయ భావనా స్రవంతిలో సంగ మిస్తాయి. ఈ ఔన్నత్యాలను చాటడానికి ఆయన మనస్సు ఎంతగా తపించిందో ఒకపద్యం చూడండి.

ఏనాడు మా కావ్యకర్తల జిహ్వ

విశ్వ సత్యము నాలపింపగలదొ

ఏనాడు మా జాతి దృష్టిమాంద్యము నాపి

చుట్టుప్రక్కల  తేరిచూడగలదొ

ఏనాడు మా బుఱ్ఱ లీ జుట్టు తల లేని

పుక్కిటి కథలలో చిక్కుపడవొ

ఏనాడు మా విద్య లినుప సంఘమునందు

చిలుము పట్టక ప్రకాశింపగలదొ

 

తనువు దాచక సోమరితనము వీడి

ఎన్నడీ మఠంబులు బిచ్చమెత్తుకొనవొ

అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి

నలిగిపోవుచు నున్నది నా మనస్సు   (గబ్బిలము)

అనేక కారణాలవల్ల ఈ దేశంలోనికి విదేశీయులు చొరబడి స్థిరపడినారు. ఇక్కడి లక్షణా లేవీ వీరు ఒంటబట్టించు కొనలేదు. కాని వాళ్ల కట్టు, బొట్టు, జుట్టు వగైరాలు ఇక్కడివాళ్లు స్వీకరించారు. మంచి ఎక్కడున్నా స్వీకరించే మహనీయగుణానికి ఈ దేశీయులు ఎప్పుడూ సిద్ధమే. అట్టి సుహృద్వాతా వరణంలో బయటినుండి ఇక్కడికి వచ్చి కొందరు పాలలో నీళ్లలా కలిసిపోయారు. సంతోషమే! కాని మరికొందరేమో పాలను విరిచే ఉప్పులా తయారై నారు. విదేశీయమైన సులోచనాలు ఇక్కడ కొందరికి ఇష్టమౌతున్నాయి. వీరివల్ల సామాజిక విచ్ఛిత్తి ఏర్పడుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాలను విరిచే ఉప్పును దూరంగా ఉంచవలసి వస్తోంది.

ఇప్పటికైనా మించింది లేదు. వీరంతా తమతమ అభిమతాల మేరకు దేనిని ఆహ్వానించినా, వారు ఏ గాలి పీలుస్తున్నారో, ఏమట్టినుండీ వచ్చిన నీరూ ఆహారం తీసుకొంటున్నారో, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి చిరకాల వ్యవస్థను విడనాడకుండా ఉండాలి. అప్పుడే జాషువా వంటి మహాకవులు కలలుగన్న జాతీయవికాసం ఏర్పడుతుంది. స్వాతంత్ర్య ఫలాలు ఈ దేశవాసులందరికీ అందుతాయి.

డా౹౹ ఆశావాది ప్రకాశరావు, శ్రీ హెబ్బార్ నాగేశ్వర రావు రచనల నుంచి….

సేకరణ :  డా౹౹ వడ్డి విజయసారథి

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.