పురోహితులు లేరు.. మంత్రాలు లేవు.. నల్లపూసల తాడుతోనే పెళ్లి! గిరిజనుల ప్రత్యేక వివాహ సంప్రదాయం

అడవి తల్లి ఒడిలో ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల జీవన విధానంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. వారి ఆచారాలు, సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా ఉంటాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా మన్యం ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజనుల వివాహ సంప్రదాయం ప్రత్యేకంగా నిలుస్తుంది.
పురోహితులు ఉండరు.. వేద మంత్రాలు వినిపించవు.. భారీగా బాజా భజంత్రీలు, డీజేలు, అలంకరణలు కనిపించవు. పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా వరుడు వధువు మెడలో నల్లపూసల తాడు కడితే వివాహం పూర్తయినట్లే. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొండరెడ్డి గిరిజనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
మేనరికపు వివాహాలకే తొలి ప్రాధాన్యం
కొండరెడ్డి గిరిజనుల వివాహాల్లో మేనరికపు సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ఇష్టపడిన తర్వాత ఇరువర్గాల పెద్దలు, బంధువులు, గ్రామ పెద్దలు ఒకచోట చేరుతారు.
వధువు ఇంటి వద్ద వివాహ ప్రకటన చేస్తారు. అనంతరం వరుడికి నల్లపూసల తాడును అందిస్తారు. వరుడు దానిని వధువు మెడలో కట్టడంతో వివాహ తంతు పూర్తవుతుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, బంధువులు చప్పట్లతో నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.
కట్నకానుకలు.. ఆర్భాటాలకు దూరం
ప్రస్తుత కాలంలో వివాహాలు భారీ ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలుగా మారుతున్నప్పటికీ, కొండరెడ్డి గిరిజనుల సంప్రదాయ వివాహాల్లో ఆర్భాటానికి పెద్దగా చోటు లేదు.కట్నకానుకలు ఉండవు. పురోహితుల అవసరం ఉండదు. బంగారు తాళిబొట్టుకు బదులుగా నల్లపూసల తాడునే ఉపయోగిస్తారు. డీజేలు, భారీ అలంకరణలు, ప్రత్యేక మండపాలు, పూజారి ఖర్చులు వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఉండదు.
ఇప్పసారా విందు.. డోలు కొయ్యల నృత్యాలు
కొండరెడ్డి గిరిజనుల వివాహ వేడుకలు సాధారణంగా రాత్రి సమయంలో జరుగుతాయి. వివాహ విందులో వారి స్థానిక ఆహార సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.అడవిలో లభించే ఇప్పపువ్వులతో తయారు చేసే ఇప్పసారా, ఇప్ప చిగురుతో రూపొందించే వంటకాలను విందులో అందిస్తారు. వివాహ వేడుకలు, విందు సందర్భంగా సంప్రదాయ ‘డోలు కొయ్యల’ వాయిద్యాల నడుమ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు.
వధూవరులకు కానుకల్లోనూ ప్రత్యేకత
వధూవరులు మండపం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కూడా కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. గ్రామ పెద్దలు, పేరంటాళ్లు, వరుడి వైపు పెద్దలు తమ స్థాయికి అనుగుణంగా రూ.20 నుంచి రూ.100 వరకు కానుకలు అందిస్తారు.
కొన్ని సందర్భాల్లో వధూవరులు వెళ్లే దారిలో కొందరు వ్యక్తులు నేలపై పడుకుంటారు. వారికి కానుక ఇచ్చిన తర్వాతే వారు పైకి లేస్తారు. మండపం నుంచి ఇంటికి చేరే వరకు ఈ ఆచారం ఐదుసార్లు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ పాటలు పాడే పేరంటాళ్లకు కూడా రూ.20 నుంచి రూ.50 వరకు కానుకలు ఇస్తారు.
పెళ్లి అనంతరం వధూవరులు ఇంటికి వెళ్లే మార్గంలో వాగులు ఎదురైతే మరో ఆసక్తికరమైన సంప్రదాయం కనిపిస్తుంది. గ్రామస్తులు వధూవరులను తమ భుజాలపై ఎత్తుకుని వాగును దాటిస్తారు. ప్రకృతితో ముడిపడిన తమ జీవన విధానానికి ఈ ఆచారం ప్రతిబింబంగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.
‘మేనరికపు పెళ్లిళ్లే ఎక్కువ’
>“మా కొండరెడ్డ్ల సంస్కృతిలో ఎక్కువగా మేనరికపు పెళ్లిళ్లే జరుగుతాయి. కట్నకానుకలు, పురోహితులు, మేళతాళాల ఆర్భాటం ఉండదు. వరుడు వధువు మెడలో నల్లపూసల తాడు వేస్తే పెళ్లయిపోయినట్లే. మేనరికం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ఎక్కడో ఒక శాతం మాత్రమే సమస్యలు కనిపిస్తాయి.”— వేట్ల రాజారెడ్డి, కొయిదా ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, బుట్టాయగూడెం**
‘తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం’
> **“అబ్బాయి, అమ్మాయి ఇష్టపడిన తర్వాత ఇరువైపుల పెద్దలు, గ్రామస్థులు ఒకచోట చేరి వివాహ ప్రకటన చేస్తారు. నల్లపూసల తాడు మెడలో పడటమే ఏడేడు జన్మల బంధంగా భావిస్తాం. మా ఆచారంలో నిరాడంబరత, పవిత్రత ఉన్నాయి. ఇది తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం.”— కెచ్చెల చిన్నంరెడ్డి, రేగులపాడు, బుట్టాయగూడెం మండలం
ఆచారమే గుర్తింపు.. నిరాడంబరతే ప్రత్యేకత
కొండరెడ్డి గిరిజనుల వివాహ సంప్రదాయం వారి జీవన విధానం, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారీ ఖర్చులు, ఆర్భాటాలకు దూరంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం, సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించడం వారి సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.