
కర్నూలు: ఆరోగ్య భారతి కర్నూలు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సి.క్యాంప్‌లోని శ్రీ టీజీవీ కళాక్షేత్రంలో కుటుంబ ఆరోగ్య సమ్మేళనం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ నిరుషా రెడ్డి గారు, క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ ఏ. కుమారస్వామి గారు, అఖిల భారతీయ సంఘటన కార్యదర్శి డాక్టర్ అశోక వాష్నీయ, అలాగే డాక్టర్ రామశర్మ గారు, డాక్టర్ మోక్షేశ్వరుడు భూరు పాల్గొని ఆరోగ్యంపై విలువైన సందేశాలను అందించారు.
డాక్టర్ నిరుషా రెడ్డి గారు మాట్లాడుతూ — మన జీవనశైలిలో మంచి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తెలిపారు.
శ్రీ ఏ. కుమారస్వామి గారు మాట్లాడుతూ — ఆరోగ్యవంతమైన కుటుంబాల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు.
డాక్టర్ అశోక్ వాసనీయ గారు మాట్లాడుతూ — ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, మంచి జీవనశైలి మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండాలని సూచించారు. వీటి ద్వారా బీపీ, షుగర్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.
అలాగే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు మన ఇల్లు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు ఏర్పడి తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమవుతుందని వివరించారు.
“ఆరోగ్య వ్యక్తి → ఆరోగ్య కుటుంబం → ఆరోగ్య గ్రామం → ఆరోగ్య సమాజం” అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమం ప్రారంభంలో ఇద్దరు చిన్నారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్య ప్రదర్శన సభికులను విశేషంగా అలరించింది.