ArticlesNews

కరుణ, దేశభక్తి పద్యాలతో పోతనను తలపించిన ‘కరుణశ్రీ

11views

( ఆగస్టు 4 – జంధ్యాల పాపయ్యశాస్త్రి జయంతి )

ఆధునికాంధ్ర సాహిత్యంలో పద్యానికి పెద్దపీట వేసి, ప్రజల నాల్కలపై నిలిపిన కవులలో అగ్రగణ్యులు కరుణశ్రీ. ప్రతీ పద్యమూ మెత్తగా రాసిన జంధ్యాల పాపయ్యశాస్త్రి పాళీ కూడా మెత్తనిదే. సుకుమార హృదయాల కంట తడి పెట్టించగల ఖండకావ్యాలకు చిరునామా కరుణశ్రీ. అదే సమయంలో ఆయన తన రచనల్లో భారతీయ అస్తిత్వానికీ, సాంస్కృతిక జాతీయవాదానికీ పెద్దపీట వేసారు. ‘కరుణశ్రీ’ అనే కలంపేరుతో అపూర్వ సాహిత్య సృజన చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగువారిలో జాతీయ ఔన్నత్యాన్నీ, మానవతా విలువలనూ ప్రోది చేసిన కమనీయ కావ్యకళామూర్తి.

జంధ్యాల పాపయ్యశాస్త్రి సామాన్య శకం 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. సంస్కృత, హిందీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. వృత్తిరీత్యా అధ్యాపకుడిగా చేస్తూనే, కవిత్వ రచన ప్రారంభించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ పేరుతో ఆయన రాసిన కవితా సంపుటాలు యావత్ తెలుగు ప్రజల గుండెలనూ కరుణరసప్లావితం చేసాయి. ఆయన పుష్పవిలాపం చదివి ఆనాటి మహిళలు పూలు ముడుచుకోవడమే మానేసారట. కుంతీకుమారి పద్యాలు చదువుతుంటే కన్నీరు పెట్టుకోనివాడే లేడట. తన కరుణార్ద్ర చిత్తంతో పాఠకులను అమితంగా ఆకట్టుకున్న కవి ఆయన.

జంధ్యాల పాపయ్య శాస్త్రికి నవరసాల్లో కరుణ అంటేనే ప్రీతి. కరుణకూ కవికీ అవినాభావ సంబంధం ఉందని ఆయన చాటి చెప్పారు. తన కవితకు స్ఫూర్తి కరుణ రసానిదే అని ప్రకటించిన ఆయన, ‘కరుణశ్రీ’ అనే కలంపేరుతోనే ప్రసిద్ధులయ్యారు. అంతేకాదు… దైవభక్తి, రసికత, సమకాలీన సాంఘిక రాజకీయ స్థితిగతుల నేపథ్యంలో పద్య గద్య కవితలు అల్లారు. వాటితోపాటు పఠితలలో సాంస్కృతిక జాతీయతా భావాన్ని ప్రేరేపించిన మహనీయుడు కరుణశ్రీ. పదలాలిత్యం, శయ్యా సౌకుమార్యం, సనాతన వైదిక సౌశీల్య వర్చస్సు, సాహితీ సమారాధన, ప్రియభావుకత్వం ఆయనకు సహజ లక్షణాలు.

మనసు మెత్తగా ఉండడమనే గుణంతో పాటు పాఠకుల్లో సమకాలీన సమాజం పట్ల అవగాహన, దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల అభిమానమూ ఉండాలన్నది కరుణశ్రీ నిశ్చితాభిప్రాయం. అందుకే తన పద్యాలను ఆ దిశలో నడిపించారాయన. తన కాలాన అందరివలెనే గాంధీ ప్రభావానికి లోనయిన కరుణశ్రీ… రాట్నసుందరి, స్వతంత్ర భారతి, కాంగ్రెస్ రథము, మా గాంధి తాత, భారత భాగ్యదేవత వంటి ఖండికలు రచించారు. అక్కడితో ఆగకుండా స్వతంత్ర సమరంలో మరో పార్శ్వానికి ప్రతినిధులైన వారినీ స్మరించుకున్నారు. నేతాజీ, భగత్ సింగు, అల్లూరి సీతారామరాజు, పురుషోత్తముడు, ఆంధ్రకేసరి వంటి కవితాఖండాలనూ సృజించారు. తెలుగువారి ఘనకీర్తిని చాటేలా తెలుగు వెలుగు, మన గురజాడ, రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రభోజుడు, కవిసార్వభౌముడు, బ్రాహ్మీమూర్తి… వంటి పద్యాలనూ రాశులకెత్తారు. తన సమకాలీన జాతీయ రాజకీయాలకు స్పందించి కవితలు భుట్టో షష్ఠాష్టకము, కరాచీతో ఢిల్లీ, యాహ్యా సప్తకము వంటి కవితలు అల్లారు. కరుణశ్రీ కవిత్వంలో విషయ వైవిధ్యానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే.

కరుణశ్రీ సాంస్కృతిక జాతీయవాదానికి కాపుకాసారని చెప్పవచ్చు. జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన రచించిన వీర రస ప్రధాన కావ్యం విజయశ్రీ. మహాద్భుత మానవేతిహాసమైన మహాభారతం ఆయనపై అమిత ప్రభావం చూపింది. అందుకే, విజయశ్రీ కావ్యాన్ని బైటకు మహాభారతానికి కవిత్వరూపంలా కనిపిస్తూ, అంతర్లీనంగా జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఆంగ్లేయులను కురు ప్రభువుతోను, భారతీయులను అర్జునుడితోనూ పోలుస్తూ కావ్యాన్ని నడిపించారు.

కరుణశ్రీ రచనల్లో పరాకాష్ఠ అనదగ్గది పుష్పవిలాపము. పూలు కోసేవారి గోళ్ళు తగిలినప్పుడు వాటికి ఎంత నొప్పి కలుగుతుందోనన్న భావన ఆనాటి తెలుగువారు అందరి గుండెలనూ చెమ్మగిల్లజేసింది. దయలేనివారు మీ ఆడువారు అన్న ఆరోపణకు నొచ్చుకున్న తెలుగు మహిళలు పూలు ముడుచుకోవడం మానేసారట. అందుకే, 1992 జూన్ 21న జంధ్యాల పాపయ్యశాస్త్రి మనకు భౌతికంగా దూరమైనా, లలిత సుగుణజాల తెలుగుబాల పద్యాల కరుణశ్రీ నేటికీ మన గుండెల్లో నిలిచి ఉన్నారు.