
పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లా కల్నా ప్రాంతంలో జగన్నాథుని రథంపై షూలతో ఎక్కి రీల్ చిత్రీకరించిన ఘటన వివాదాస్పదమైంది. వైరల్ అయిన వీడియోపై స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.
సమాచారం ప్రకారం, బాబులాల్ షేక్ (30) ఉల్టో రథ్ యాత్ర ముగిసిన అనంతరం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన జగన్నాథుని రథంపై షూలతోనే ఎక్కి వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో రథ పవిత్రతకు భంగం కలిగిందని, హిందువుల మతపరమైన భావాలు దెబ్బతిన్నాయని హరేకృష్ణ నామహట్ట సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా నాదన్‌ఘాట్ పోలీసులు బాబులాల్‌పై మతపరమైన భావాలను దెబ్బతీసినట్లు ఆరోపిస్తూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అనంతరం విచారణ జరిపిన కల్నా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతిరోజూ పోలీసుల సమక్షంలో జగన్నాథుని రథం మెట్లను నీటితో శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా బాబులాల్ తరఫు న్యాయవాది, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ పని చేయలేదని, తెలియక చేసిన పొరపాటు మాత్రమేనని కోర్టుకు తెలిపారు. ఈ ఘటన అనంతరం బాబులాల్ బహిరంగంగా చెవులు పట్టుకుని క్షమాపణలు కూడా చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు.





