
ఏలూరు : రెండో బాసరగా పేరొందిన నూజివీడులోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే వార్షిక సారె కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమానికి రాజవంశానికి చెందిన మెహర్ అప్పారావు హాజరై శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా అయోధ్య నుంచి తీసుకువచ్చిన శ్రీరాముల వారి పాదుకలు, బాలరాముడి ఉత్సవ విగ్రహం, కల్యాణ రాముడి ఆలయంలో ప్రతిష్ఠించనున్న ధనుస్సును ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. వీటిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయోధ్యకు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ, అయోధ్యకు వచ్చే తెలుగు భక్తులకు ఉచిత అన్నదానం, దర్శన ఏర్పాట్లు, ఆలయాల సందర్శనకు మార్గదర్శనం, అవసరమైన వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే అయోధ్యలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో కల్యాణ రాముడి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తైన సీతారాముల విగ్రహంతో పాటు కల్యాణ రాముడి ఆలయం, శ్రీరాముడి వంశవృక్షాన్ని ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
శ్రీరాముల వారి పాదుకలతో రామేశ్వరం నుంచి అయోధ్య వరకు కాలినడక యాత్ర నిర్వహించినట్లు శ్రీనివాస శాస్త్రి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ పాదుకలు, బాలరాముడి ఉత్సవ విగ్రహం, ధనుస్సును భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. అయోధ్యకు వచ్చే తెలుగు భక్తులకు దర్శనం, వసతి, ఇతర ఏర్పాట్లలో సహకారం అందిస్తామని తెలిపారు.





