
తిరుపతి జిల్లా ఏర్పేడులోని సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమ శత జయంతి వేడుకలను ఆగస్టు 27 నుంచి వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి స్వామి తెలిపారు.
విలేకరులతో మాట్లాడిన ఆయన, శత జయంతి ఉత్సవాలను ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సద్గురు మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా వ్యాసాశ్రమం ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తోందని తెలిపారు.
ఆశ్రమంలో ప్రస్తుతం 500 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారని, వారు మంచి ఫలితాలు సాధిస్తూ ఆశ్రమ ఖ్యాతిని చాటుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే కంటి ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించి వైద్య సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు.
వ్యాసాశ్రమంపై కొందరు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాలను మానుకోవాలని పరిపూర్ణానంద గిరి స్వామి కోరారు. ఆశ్రమ ప్రతిష్ఠను కాపాడేందుకు భక్తులు, శిష్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.





