
బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ నాగేంద్రపై నమోదైన రెండు క్రిమినల్ కేసుల తదుపరి దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎం. నాగప్రసన్న పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫిర్యాదుదారుడి చిరునామాలో విదేశీ వివరాలు ఉన్నప్పుడు, ప్రాథమిక దర్యాప్తు చేయకుండా కేసు ఎలా నమోదు చేశారని కోర్టు ప్రశ్నించింది.
అక్రమ వలసలకు సంబంధించిన అంశాలు జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు, పోలీసులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తపడాలని వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని స్పష్టం చేసింది.
అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. అధిక అద్దె కోసం జాతీయ భద్రతను విస్మరించే పరిస్థితులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన ప్రకారం, డాక్టర్ నాగేంద్ర అక్రమ బంగ్లాదేశీ వలసదారుల గురించి పోలీసులకు సమాచారం అందిస్తూ వస్తున్నారు. జూలై 22న కూడా ఆయన అలాంటి సమాచారం పోలీసులకు, సంబంధిత అధికారులకు అందించిన అనంతరం, కొద్ది సమయంలోనే ఆయనపై దాడి ఆరోపణలతో ఒక కేసు నమోదైందని, అదే రోజు మరో పోలీస్ స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, మరుసటి రోజు బెయిల్ మంజూరైనట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.





