
6views
తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) నాయకులు తిరుప్పూర్లోని 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కుమరన్ కుండ్రు మురుగన్ ఆలయ తలుపులను పగులగొట్టి, ఆలయ భూమిని ఆక్రమించుకున్నారని సమాచారం. అక్కడే వున్న పోలీసులు ఈ అక్రమ చర్యను అడ్డుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, హిందూ మున్నణి రాష్ట్ర అధ్యక్షుడు కాడేశ్వర సి. సుబ్రమణ్యం జులై 28న ఒక ప్రకటన విడుదల చేశారు. కేసుకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, కమ్యూనిస్టు నాయకులు ఆలయ గేటు తాళాలు పగులగొట్టి, ఆక్రమణకు పాల్పడేందుకు యత్నించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
2026 జనవరిలో ప్రభుత్వం ఈ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత, న్యాయం కోసం భక్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, సీపీఎం నేతలు గేటు తాళాలు తొలగించి ఆలయంలోకి ప్రవేశించి భూమిని ఆక్రమించేందుకు యత్నించారని ఆరోపించారు. “అక్కడ ఉన్న పోలీసులు కూడా వారిని అడ్డుకోలేదు” అని ఆయన అన్నారు.
హిందూ మున్నణి నాయకుడు మాట్లాడుతూ, ”కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సీపీఐ(ఎం) నాయకులు ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు? వారు అధికారంలో ఉన్న కూటమిలో భాగమైనందుకే ఆలయ భూమిని ఆక్రమించడానికి అంత ధైర్యం వచ్చిందా? ఇటువంటి చర్యలు జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయి” అని వ్యాఖ్యానించారు.కుమరన్ కుండ్రు ఆలయ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు యత్నించిన సీపీఐ(ఎం) నాయకులపై టీవీకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.





