News

దివ్యాంగ భర్తను 180కి.మీలు భుజాలపై మోస్తూ కావడి యాత్ర పూర్తి

6views

ప్రస్తుత కాలంలో చాలా మంది దంపతులు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్నారు. ఇంకొందరు తమ భాగస్వాములను చిన్న గొడవ జరగ్గానే విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ దివ్యాంగుడైన తన భర్తను భుజాలపై మోస్తూ కావడి యాత్ర పూర్తి చేసింది. ఈ క్రమంలో పవిత్రమైన ప్రేమ, విశ్వాసానికి మంచి ఊదాహరణగా నిలిచిపోయింది.

180కి.మీలు భుజాలపైనే
హరిద్వార్‌లో కావడి యాత్ర ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ గంగా నది నుంచి పవిత్ర జలాన్ని సేకరించడానికి చాలా మంది యాత్రికులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. యూపీ రాష్ట్రం గాజియాబాద్‌ జిల్లాలోని మోదీనగర్‌కు చెందిన ఆశా కూడా తన దివ్యాంగుడైన భర్త సచిన్‌తో కలిసి హరిద్వార్‌కు వెళ్లింది. ఈ కావడి యాత్ర కోసం ఆశా తన భర్త సచిన్‌ను భుజాలపై మోస్తూ 180 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించింది. హరిద్వార్‌కు చేరుకున్న తర్వాత ఆశా దంపతులు మొదట ‘హర్ కీ పౌడీ’ వద్ద పవిత్ర జలాన్ని సేకరించారు. ఆపై కంఖాల్‌లోని దక్షేశ్వర మహాదేవ ఆలయంలో జలాభిషేకం చేసి సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. అనంతరం తమ స్వస్థలానికి బయలుదేరారు.

వరుసగా రెండో ఏడాది కావడి యాత్ర పూర్తి
కొన్నాళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో సచిన్ గాయపడ్డాడు. అప్పుడు వెన్నుమొకకు గాయమైంది. శస్త్రచికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సచిన్ పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. అయితే సచిన్‌కు దైవ భక్తి ఎక్కువ. తనకు కావడి యాత్ర చేయాలని ఉందని గతేడాది తన భార్య ఆశాకు సచిన్ చెప్పాడు. భర్త కోరికకు ఆమె పూర్తి మద్దతు పలికింది. భర్తను తన భుజాలపై మోసుకెళ్లి గతేడాది కావడి యాత్రను పూర్తి చేసింది. ఈ ఏడాది కూడా కాలినడకన తీర్థయాత్ర చేయడానికి ఆశా తన భర్తను భుజాలపై మోసుకుంటూ హరిద్వార్‌కు తీసుకెళ్లింది. ఈ దంపతుల ఇద్దరు పిల్లలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.

నా భార్య పక్కన ఉంటే ఆ లోటు తెలియడం లేదు : సచిన్
తనకు శివునిపై అపారమైన భక్తి ఉందని ఆశా భర్త, దివ్యాంగుడు సచిన్ తెలిపాడు. గతంలో ప్రతి ఏటా హరిద్వార్‌కు కావడి యాత్ర చేసేవాడినని పేర్కొన్నాడు. అయితే సుమారు 12 ఏళ్ల క్రితం వెన్నెముకకు అయిన గాయం కారణంగా తాను దివ్యాంగుడినైపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి నడవలేకపోతున్నానని చెప్పాడు.

మహిళలు తమ వైవాహిక బాధ్యతలను నిలబెట్టుకోవాలి : ఆశా
మోదీనగర్‌లో కూడా శివునికి జలాభిషేకం చేసి తన కావడి యాత్రను పూర్తి చేస్తానని ఆశా స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో భర్తలను హత్య చేసిన కొందరు మహిళల గురించి వచ్చిన వార్తలు సమాజాన్ని కలవరపెట్టాయని పేర్కొంది. టీవీ, సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ఇటువంటి కథనాలు మహిళలందరికీ కళంకం తెస్తాయని అభిప్రాయపడింది. మహిళలు తమ వైవాహిక ప్రమాణాలను, బాధ్యతలను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ (షార్ట్ వీడియోలు) చేసే మహిళలు సాంస్కృతిక విలువలను, హుందాతనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసింది.

అందరికీ ప్రేరణగా ఆశా-సచిన్ దంపతులు
ఈ దంపతులు చేసిన కావడి యాత్ర కేవలం దైవ దర్శనానికి చేసే ప్రయాణం మాత్రమే కాదు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న అచంచలమైన అంకితభావం, నమ్మకం, నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతి అడుగులోనూ దివ్యాంగుడైన తన భర్తకు అండగా నిలిచి భార్య బాధ్యతలను సమాజానికి ఆశా చాటిచెబుతోంది.