News

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

5views

గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒకవైపునకు ఒరిగిన ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రాత్రివేళ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

విగ్రహం దిమ్మె పరిస్థితిని పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విగ్రహానికి సంబంధించిన వివరాలను ఫొటోల రూపంలో అధికారులకు పంపించి, ఇరిగేషన్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌తో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సప్తరుషుల్లో అగ్రగణ్యుడైన వశిష్ఠ మహర్షి పేరు మీద ప్రవహించే గోదావరి పాయ సనాతన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ విగ్రహాన్ని యథాస్థితికి తీసుకువచ్చి భద్రంగా పునఃప్రతిష్ఠ చేయాలని అధికారులను ఆదేశించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల పరిరక్షణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేసి విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. వశిష్ఠ మహర్షి క్షేత్ర ప్రాధాన్యతను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.