
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
“ప్రధానమంత్రి తన సలహాదారులను మార్చుకోవాలి. కొత్త కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ కమిటీలో మాజీ ఐబీ చీఫ్, ఒక ఐటీ కంపెనీ అధిపతితో పాటు ఒక గోమూత్ర నిపుణుడు కూడా ఉన్నారు” అని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు.
అయితే, ప్రొఫెసర్ కామకోటి గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వివాదం తలెత్తింది. 2025 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గోమూత్రానికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై కొన్ని శాస్త్రీయ పరిశోధనలు జరిగాయని తెలిపారు. తన వ్యాఖ్యలకు మద్దతుగా పీర్ రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయనాలను ప్రస్తావించారు.
కంప్యూటర్ సైన్స్ రంగంలో గుర్తింపు
ప్రొఫెసర్ వి. కామకోటి దేశంలోని ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2001లో అదే సంస్థలో అధ్యాపకుడిగా చేరిన ఆయన, 2022 జనవరిలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ రంగాల్లో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఐఐటీ మద్రాస్‌లో మైక్రోప్రాసెసర్ అభివృద్ధి కార్యక్రమం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
జాతీయ భద్రతా సలహా మండలి (NSAB) సభ్యుడిగా ఉన్న ఆయన, భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ మేధస్సు (AI) టాస్క్‌ఫోర్స్‌కు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సాంకేతిక కమిటీల్లోనూ ఆయన సేవలందించారు.
పరిశోధనల్లో విశేష కృషి
ప్రొఫెసర్ కామకోటి అంతర్జాతీయ జర్నల్స్, సదస్సుల్లో 150కిపైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. పలువురు ఎంఎస్, పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించారు. పరిశ్రమలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల కోసం దాదాపు 50 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆయనకు డీఆర్‌డీవో అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, ఐఈఎస్‌ఏ టెక్నో విజనరీ అవార్డు, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్, ఏసీసీఎస్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డు, వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డులు లభించాయి.
కాగా, రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రొఫెసర్ కామకోటి పేరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.




