
నరసరావుపేట: గోమాతకు రాజ్యాంగబద్ధమైన జాతీయ గౌరవ హోదా కల్పించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధి రాధారమణదాస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోమాతకు “రాష్ట్ర మాత” లేదా “జాతీయ ఆరాధ్య దేవత” అనే రాజ్యాంగబద్ధ హోదా కల్పించి దేశవ్యాప్తంగా గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, దేశంలో గోవధను పూర్తిగా నిషేధించేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గోశాలల నిర్వహణకు ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి వాటి అభివృద్ధి, పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల గోశాల ప్రతినిధులు శివనాగేశ్వరరావు, కృష్ణచంద్రతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.





