News

“బంగ్లాదేశ్‌లో భారత సైన్యం ముందు లొంగిపోయినప్పుడు సిగ్గు అనిపించలేదా?” : పాక్ ని నిలదీసిన మౌలానా

13views

ఇస్లామాబాద్ (పాకిస్తాన్) – పాకిస్థాన్‌లో రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, ఆ దేశ సైన్యంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ పాకిస్థానీ సైనిక నాయకత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. “1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ సైన్యం లొంగిపోయినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా?” అంటూ ఆయన ప్రశ్నించారు.

గతంలో కూడా ఆయన సైన్యాధికారులను ఉద్దేశించి, “రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే యూనిఫాం తీసేసి ఎన్నికల్లో పోటీ చేయండి” అని సవాలు విసిరిన విషయం తెలిసిందే.

“దేశ రక్షణ సైన్యం బాధ్యతే; ప్రజలది కాదు!”

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పౌరులతో సాయుధ బృందాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఫజలుర్ రెహమాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, “దేశాన్ని రక్షించడం ప్రజల బాధ్యత కాదు. అందుకోసమే సైన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి, ప్రజల పన్నుల డబ్బుతో వారికి జీతాలు చెల్లిస్తోంది. మా రక్తత్యాగాలను పదేపదే ప్రస్తావిస్తూ, చివరకు ఆయుధాలు పట్టుకుని మేమే పోరాడాలని చెప్పడం సమంజసం కాదు. నేను ప్రభుత్వంనుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అందువల్ల నేను ఎలాంటి సాయుధ బృందాన్ని ఏర్పాటు చేయను” అని స్పష్టం చేశారు.