News

సృష్టి నిర్మాణం నుంచే మాతృత్వం ప్రారంభం : మోహన్ భాగవత్ -1

6views

మాతృత్వం అనేది సృష్టి నిర్మాణం నుంచే ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మాతృత్వం అనేది అత్యంత సనాతనమైందన్నారు. ప్రకృతికి సంబంధించిన ప్రవృత్తే మాతృత్వం అని అభివర్ణించారు. సృష్టి నిర్మాణం అవడమే ఆలస్యం.. విస్తరిస్తూ వచ్చిందని, అయితే.. మాతృత్వం లేనిది సృష్టి నిర్మాణమే ముందుకు సాగదన్నారు. హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో ఆదివారం ‘‘యుగానుకూల మాతృత్వం’’ అనే అంశంపై విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో ఓ సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరై, మాతృమూర్తులకు మార్గదర్శనం చేశారు.

మాతృత్వానికి సంబంధించి మాతృమూర్తుల దగ్గర కొన్ని యుగాల అనుభవం వుందని, అందుకే మాతృత్వం గురించి వారికి పెద్దగా చెప్పాల్సిన అవసరమే వుండదని, చర్చించాల్సిన అవసరం కూడా వుందన్నారు. ప్రస్తుతం పరిస్థితులు, వాతావరణం మారిందని, ఇలా మారడం నిత్యకృత్యమని అన్నారు. ఇన్ని పరిస్థితులు, వాతావరణం మారినా.. మన శాశ్వతమైన విలువలను ఆధారం చేసుకొని మాతృమూర్తులు తమ సంతానాన్ని పోషిస్తూ, వృద్ధి చేస్తూ వస్తున్నారని అన్నారు.

మాతృత్వం గురించి ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారని, అయితే.. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకు కారణం సంపూర్ణ సమాజమే అని అన్నారు. భారత అత్యంత ప్రాచీన దేశమని, అలాగే మాతృత్వం అన్న అంశంలో కూడా భారత్ అత్యంత ప్రాచీనమైందని పేర్కొన్నారు. కానీ.. మాతృత్వంలోని ప్రేరణను, సందేశాన్ని మరిచిపోవడం వల్ల సమాజం అధోగతి పాలైందని, దీనిని ఆసరాగా చేసుకొని విదేశీ శక్తులు మన దేశాన్ని లూటీ చేశారని, విజృంభించారన్నారు. చివరి విదేశీ పాలకులైన బ్రిటీషర్లు ఆత్మ విస్మృతిని మరింత సుదృఢం చేసి వెళ్లిపోయారన్నారు. అంతేకాకుండా మన దేశ ప్రాచీన అంశాలన్నీ వ్యర్థమైనవి అనేట్లుగా మన బుర్రలను తయారు చేశారన్నారు.గత రెండు వేల సంవత్సరాల నుంచి మన పద్ధతులను, సంప్రదాయాలను విస్మరిస్తూ వస్తున్నామని అందరూ భావిస్తారని కానీ.. మహా భారత కాలం నుంచే ఆ విస్మృతి అనేది ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచే క్రమ క్రమంగా మన పద్ధతులను, ఆచారాలను, సంప్రదాయాలను విస్మరిస్తూ వస్తున్నామని అన్నారు.ఇక.. దాని తర్వాత ఆక్రమణలు ప్రారంభమయ్యాయని, అక్కడి నుంచి మన పద్ధతులపైనే మన మనస్సుల్లోనే, మనకే ద్వేషం పుట్టేంతలా విదేశీయులు తయారు చేశారన్నారు.విదేశీ పద్ధతులు, వ్యవహారాలే సరైనవి, మన సంప్రదాయాలు, మన వ్యవహారాలే తప్పుడు అన్న భావనను క్రమ క్రమంగా తెచ్చారని పేర్కొన్నారు. అసలైన సంప్రదాయాలు, పద్ధతులు కూడా మనకు తెలియకుండా పోయాయన్నారు.ఈ అసంపూర్ణ దృష్టితో తప్పుడు భావనలు పాశ్చాత్య దేశాల్లో నడుస్తున్నాయని, దీని కారణంగా అక్కడ అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, కొన్నింటిని అక్కడి నుంచి తీసుకున్నామని, అయితే ఆ సమస్యలకు వారి దగ్గర సమాధానాలు లేవని, మనకు కూడా లభించడం లేదన్నారు. అయినా అవే ప్రమాణంగా, ఆ కథనాలే ప్రమాణంగా కొందరు ఇక్కడ కూడా నడుచుకుంటున్నారన్నారు.

అసలు భారత్ లో లేని కథనాలను కూడా విదేశీయులు పుట్టించారని, వాటిని ఇక్కడ నడిపిస్తున్నారన్నారు. ఉదాహరణకు పురుషులు శ్రేష్ఠులా? మహిళలు శ్రేష్ఠులా? అన్న వాదనను కూడా తీసుకొస్తున్నారన్నారు. పురుషుల పక్షం తీసుకునేవారు పురుషులు శ్రేష్ఠులని, మహిళల పక్షం వహించే వారు మహిళలే శ్రేష్ఠులని వాదిస్తుంటారన్నారు. అయితే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న తర్క వాదాలు సమాజంలో వున్నాయన్నారు. దీని తర్వాత మరి మహిళలే ఎక్కువైతే.. కుటుంబంలో బానిసగా ఎందుకు వుంటోంది? కుటుంబంలో బానిసగా వుంచే వివాహ బంధాన్ని ఎందుకు స్వీకరించింది? మహిళలు ఏదైనా చేయగలరు అని వాదాలు బయటికి తీస్తారన్నారు. మహిళలు ఏదైనా చేయగలరన్న వాదన ఒట్టి భ్రమేనని, పురుషులు ఏదైనా చేయగలరన్న వాదనా అంతే భ్రమ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వ మాంగల్య సభ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ జితేంద్రనాథ్ మహారాజ్ గారు, జాతీయ సంఘటన మంత్రి డాక్టర్ రుశాలి జోషి గారు, అఖిల భారత విశ్వ మాంగల్య సభ మార్గదర్శకులు శ్రీ ప్రశాంత్ జీ హోల్కర్ గారు, విశ్వ మాంగల్య సభ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి నలిని హవాడే , జాతీయ సంఘటన మంత్రి డాక్టర్ రుశాలి జోషి , సూరజ్ జీ దామోర్ విశ్వమాంగల్య సభ జాతీయ ఉపాధ్యక్షుడు , భగవతి జీ బాల్డ్వా – స్వాగత సమితి అధ్యక్షురాలు, సహ కార్యదర్శి శృతి బొడ్డుపల్లి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమానికి మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర దక్షిణ భారత రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది విశ్వ మాంగల్య సభ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ ‘దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్’ సమావేశాల్లో దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి మహిళా ప్రతినిధులు, ప్రముఖులు, మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.