News

పీఓకేలో మళ్లీ ఉద్రిక్తత.. ముజఫరాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌

27views

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్‌ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ’ (జేఏఏసీ) రావల్‌కోట్‌ నుంచి ముజఫరాబాద్‌ వరకు లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని ‘యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ’ (యూకేపీఎన్‌పీ) పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరింది.

ఆదివారం మీర్‌పూర్‌ డివిజన్‌ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీలు రావల్‌కోట్‌లో కలుసుకున్నాయి. అక్కడి నుంచి ముజఫరాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌గా బయలుదేరాయి. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పాక్‌ ప్రభుత్వం రేంజర్స్‌, ఫ్రంటియర్‌ కానిస్టేబులరీ (ఎఫ్‌సీ), పంజాబ్‌ కానిస్టేబులరీ (పీసీ) దళాలను అదనంగా మోహరించినట్లు సమాచారం.

జూన్‌ 5 నుంచి పీఓకేలో కొనసాగుతున్న అశాంతి కారణంగా 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయని యూకేపీఎన్‌పీ పేర్కొంది. ప్రతి మరణం, గాయంపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

అలాగే ఐక్యరాజ్యసమితి (యూఎన్‌), యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), అమెరికా, బ్రిటన్‌, రష్యాతో పాటు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొని పౌరుల భద్రత, శాంతియుత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు కూడా పీఓకేలోని పరిణామాలను నిశితంగా గమనించి, ఉల్లంఘనలపై స్వతంత్రంగా నివేదికలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించడం, మంగ్లా జలవిద్యుత్‌ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను స్థానికులకు తక్కువ ధరకే అందించడం, నిత్యావసర వస్తువులపై సబ్సిడీల వంటి డిమాండ్లతో దాదాపు గత రెండు నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు పన్నుల రద్దు, స్థానికులకు అధిక రాజకీయ-పరిపాలనా అధికారాలు, అవినీతిపై చర్యలు, అరెస్టయిన నిరసనకారుల విడుదల, కేసుల ఉపసంహరణ వంటి మొత్తం 38 డిమాండ్లతో పాకిస్థాన్‌ ప్రభుత్వంతో జేఏఏసీ పలుసార్లు చర్చలు జరిపింది. అయితే కీలక అంశాలపై అంగీకారం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రజలను మరోసారి సమీకరించి లాంగ్‌ మార్చ్‌కు జేఏఏసీ పిలుపునిచ్చింది.