News

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. పిటిషన్‌ కొట్టివేత

6views

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలంలో నిబంధనల మేరకు ఆలయ నిర్మాణం చేపట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.

ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లో బలం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమిలో నిబంధనలకు అనుగుణంగా ఆలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వడంలో తప్పేమీ లేదని వెల్లడించింది.

సుప్రీంకోర్టు తీర్పును స్థానికులు, భక్తులు స్వాగతించారు. ఆలయ నిర్మాణ పనులు ఇక వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తీర్పు రామభక్తులకు ఆనందాన్ని కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. సత్యం గెలిచింది. ధర్మం గెలిచింది. శ్రీరాముడు గెలిచాడు. జై శ్రీరామ్‌’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.