News

సిట్ నివేదిక తర్వాతే CEO నియామకం : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

5views

అయోధ్య రామమందిర ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 9 మందితో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అయోధ్యకు చెందిన ఐదుగురు సాధువులు, వేరే ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారం తర్వాత రెండోసారి సమావేశమైన ట్రస్ట్ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామాలయంలో అర్చకత్వం నిర్వహించే పూజారుల కోసం ఓ శాశ్వత శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. ఈ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులకు ట్రస్ట్ ద్వారా ధ్రువపత్రాలను అందజేస్తామని తెలిపారు. ట్రస్ట్‌ సీఈవో పదవికి దేశవ్యాప్తంగా 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఓ అంతర్గత కార్యదర్శిని నియమించాలని సమావేశంలో నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రామాలయ విరాళాల దుర్వినియోగానికి సంబంధించి సిట్‌ తుది నివేదిక ఇంకా తమకు అందలేదన్న గోవింద్ దేవ్ గిరి సిట్‌ నివేదిక తర్వాతే సీఈవో నియామకంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలోనే, శ్రావణమాసంలో వచ్చే భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లు, ఖాళీగా ఉన్న ధర్మకర్తల పదవుల భర్తీ సహా, పలు పరిపాలనా, ఆర్థిక సమస్యలను కూడా సమీక్షించారు. ఈ సమావేశం తర్వాత ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్​, కోశాధికారి గోవింద్​ దేవ్​ గిరి విలేకరులతో మాట్లాడారు. “రామ మందిరానికి సంబంధించిన అన్ని మతపరమైన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక శాశ్వత మత కమిటీని ఏర్పాటు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఈ కమిటీలో 9 మంది సాధువులు ఉంటారు. వీరిలో ఐదుగురు అయోధ్యకు చెందినవారు కాగా, నలుగురు బయటివారు ఉంటారు” అని గోవింద్ దేవ్​ గిరి తెలిపారు.

వైష్ణవ-రామానంది నిబంధనల అమలు!
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు, నిర్మోహి అఖాఢా అధిపతి దినేంద్ర దాస్​ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ ట్రస్ట్​లో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒక దానికి దివంగత ట్రస్టీ బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్​ మిశ్రా కుమారుడిని నియమించాలని కోరారు. దీనితోపాటు ఆలయ పూజా విధానాలు, ఆచారాలు కచ్చితంగా వైష్ణవ-రామానంది సంప్రదాయం ప్రకారమే జరగాలని తాను ట్రస్ట్ ముందు ప్రతిపాదించినట్లు తెలిపారు. వైష్ణవ సంప్రదాయంలోని ఈ విధానం ప్రకారం, శ్రీరాముడిని సర్వోన్నత దేవుడిగా పూజిస్తారు. ఈ సంప్రదాయం సంత్ రామానంద కాలం నుంచి వస్తోంది. అయోధ్యలోని మిగిలిన ఆలయాల తరహాలోనే ఈ రామాలయంలో కూడా రోజువారీ పూజలు, ఇతర కార్యక్రమాలు ఈ వైష్ణవ-రామానంది సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. అయితే దక్షిణ భారతదేశంలో అనుసరించే రామానుజాచార్య సంప్రదాయం ఇక్కడకు తీసుకురావడంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ను తిరిగి ట్రస్టులోకి తీసుకువచ్చే విషయమై ఏమైనా చర్చ జరిగిందా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని దినేంద్ర దాస్​ చెప్పారు. అయితే ట్రస్ట్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యమేనని అన్నారు. అలాగే అయోధ్య రామమందిర విరాళా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రారంభించిన శుద్ధీకరణ ప్రక్రియ అనేది ఒక ఆచారమని, ఇది మరో రెండు మూడు రోజులపాటు కొనసాగుతుందని దాస్​ చెప్పారు. “ప్రాయశ్చిత్తంగా చేస్తున్న ఈ శుద్ధీకరణ ఆచారం ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇస్తోంది. మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని చెప్పారు.