News

అన్నవరం ఆలయంలో వరుణ యాగం..

16views

అన్నవరం: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో వరుణ యాగాలు, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించాలని దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆదేశించిన నేపథ్యంలో అన్నవరం దేవస్థానం కార్యాచరణ ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) చక్రధరరావు  వైదిక బృందంతో సమావేశమై యాగ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సంకల్పిస్తూ నిర్వహించే వైదిక క్రతువుల విధివిధానాలపై పండితులతో చర్చించారు.

మూడు రోజులపాటు వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఈవో తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు అనువైన తేదీలను ఖరారు చేసి, భక్తుల భాగస్వామ్యంతో వైభవంగా నిర్వహించాలని వైదిక బృందానికి సూచించారు.

వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.