News

ముజఫర్‌నగర్‌లో అక్రమ ఆస్తుల విక్రయాలపై హిందువుల ఐక్య నిరసన

5views

ముజఫర్‌నగర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా జనకపురి కాలనీలో హిందూ సమాజం ఐక్యంగా స్పందించిన ఘటన చర్చనీయాంశమైంది. హిందువులు అధిక సంఖ్యలో నివసించే ఈ కాలనీలో కొందరు ముస్లిం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయడంపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టాయి.

హిందూ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయా ఇళ్ల వద్దకు చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కాలనీ జనాభా స్వరూపాన్ని మార్చే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆస్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

హిందూ సంఘర్ష్ సమితి కన్వీనర్ నరేంద్ర పవార్ మాట్లాడుతూ, సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం లభించే వరకు ప్రతి వారం హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగిస్తామని తెలిపారు.

నిరసనల నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక విచారణలో ముస్లిం కుటుంబాలు కొనుగోలు చేసిన ఆరు ఇళ్లను అధికారులు పరిశీలించారు. వాటిలో నాలుగు ఇళ్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద నిర్మించబడినవిగా గుర్తించినట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాల నిబంధనల ప్రకారం అర్హతలు, విక్రయ నిబంధనల ఉల్లంఘన జరిగిందనే అనుమానాల నేపథ్యంలో అధికారులు సంబంధిత ఇళ్లపై చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిగాయని తేలిన ఇళ్లను సీల్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఇళ్లకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ సందర్భంగా స్థానిక అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ మిశ్రా మాట్లాడుతూ, ప్రాంతంలో తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అన్ని ఫిర్యాదులను చట్టబద్ధంగా విచారించి, నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.