News

ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్

27views
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్‌పూర్‌లోని తేరాపంథ్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా అఖిల భారతీయ స్థాయిలో బాధ్యతలు వున్నవారు, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమకాలీన జాతీయ, సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించారు.
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే తీర్మానం
భారతీయ సమాజానికి మూలస్తంభమైన కుటుంబ వ్యవస్థను సురక్షితంగా, సుదృఢంగా ఉంచడంపై ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ కుటుంబ వ్యవస్థ శతాబ్దాలుగా సమాజాన్ని సంస్కారవంతంగా, ఐక్యంగా మరియు ఆత్మీయంగా ఉంచిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న సవాళ్లకు సమాజం మరియు ప్రభుత్వం రెండింటి స్థాయిలోనూ ఓ పరిష్కారం అవసరమని అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధాలకు గుర్తింపు, లివ్-ఇన్ రిలేషన్లకు చట్టబద్ధత, స్వలింగ సంపర్కానికి గుర్తింపు వంటి కొన్ని న్యాయపరమైన నిర్ణయాలు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను దెబ్బతీశాయని, వీటిపై సమగ్ర చర్చ జరిపి, కుటుంబ వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టేలా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ ప్రబోధనం మరియు కుటుంబ విలువల పరిరక్షణ కోసం సమగ్ర ప్రజా చైతన్య ప్రచారాన్ని నిర్వహించాలని విహెచ్‌పి నిర్ణయించింది.
స్వామి లక్ష్మణానంద సరస్వతి జీ హత్య విచారణ కమిషన్ నివేదికపై ఆందోళన
ఒడిశాలోని కంధమాల్‌లో పూజ్య స్వామి లక్ష్మణానంద సరస్వతి జీ దారుణ హత్యపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక మాయమవ్వడం మరియు దానిని బహిర్గతం చేయకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ (CBI) ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర నిర్వహణ కమిటీ డిమాండ్ చేసింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంపై నిజాన్ని బయటకు తీసుకురావడం న్యాయానికి, ప్రజల నమ్మకానికి అత్యంత అవసరమని విహెచ్‌పి పేర్కొంది. అలాగే ఒడిశాలో మత మార్పిడులపై పూర్తి నిషేధం విధించాలని పిలుపునిచ్చారు.
సంత్ రవిదాస్ జీ 650వ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రకటన
సంత్ శిరోమణి గురు రవిదాస్ జీ 650వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటనను ఆమోదించారు. సంత్ రవిదాస్ జీ అందించిన సామాజిక సమరసత, సమానత్వం, ఆధ్యాత్మిక చైతన్యం మరియు మానవ మర్యాద సందేశాలు నేటికీ ఇరు భారతీయ సమాజానికి స్ఫూర్తిదాయకమని విహెచ్‌పి తెలిపింది.
దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించి ఆయన సందేశాన్ని సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేస్తామని విహెచ్‌పి సంకల్పించింది.
సింఘాల్ శతాబ్ది జయంతి సంవత్సరం సందర్భంగా ప్రణాళిక
2026 సెప్టెంబర్ 27న శ్రీ రామ్ జన్మభూమి ఉద్యమ నేత అశోక్ సింఘాల్ జీ జయంతి ఉంది. ఆయన హిందూ సమాజం కోసం చేసిన అసమాన సేవలను ఏడాది పొడవునా సమాజం ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఆయన శతాబ్ది జయంతి సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ సంస్థాగత విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
అశోక్ సింఘాల్ రామ్ మందిర్ ఉద్యమానికి బలమైన నాయకత్వాన్ని అందించారు, హిందూ చైతన్య ప్రచారాన్ని నిర్వహించారు, సామాజిక సమరసతను ప్రోత్సహించారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా గోసంరక్షణ, గోసంవర్ధన కార్యక్రమాలను విస్తరిస్తారు. వేద పాఠశాలలు ప్రాచీన భారతీయ జ్ఞాన పరంపరను పునఃప్రతిష్ఠించే కేంద్రాలుగా మారతాయి. ఆయన విశ్వ హిందూ పరిషత్‌ను ఒక శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన దూరదృష్టి, నిరంతర శ్రమ హిందూ సమాజంలో నూతన చైతన్యాన్ని నింపాయి. ఈ సందర్భంగా కోటి మంది హితచింతకులను (సభ్యులను) చేర్పించాలని విహెచ్‌పి సంకల్పించింది.
హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం, సనాతన విలువలను పరిరక్షించడం మరియు జాతీయ ప్రయోజనాల కోసం చురుగ్గా పనిచేస్తామనే సంకల్పంతో సమావేశం ముగిసింది.