News

గణేష్ ఉత్సవాల అనుమతులకు ప్రత్యేక యాప్.. సింగిల్ విండో విధానం అమలు:

28views

అమలాపురం: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణను మరింత సులభతరం చేయడానికి గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంది. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో మంజూరు చేసేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చలసాని ఆంజనేయులు ప్రకటించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన జిల్లా గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సమావేశం జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు వినాయక నవరాత్రుల నిర్వహణపై ముందస్తు కార్యాచరణను వెల్లడించారు.

వినాయక మండపాల అనుమతులు, నిమజ్జన ఊరేగింపులు, ఇతర పరిపాలనా అనుమతుల కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానం ద్వారా ఉత్సవ కమిటీలకు వేగవంతమైన సేవలు అందుతాయని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని పేర్కొన్నారు.

కోనసీమ జిల్లాలోని 16 మండలాల్లో గ్రామ స్థాయి గణేష్ ఉత్సవ కమిటీల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే పలు మండలాల్లో కమిటీల నియామకం పూర్తయిందని, మిగిలిన మండలాల్లో త్వరలోనే ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు.

జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భాను ప్రకాశ్ మాట్లాడుతూ, హైదరాబాద్ తరహాలో కోనసీమలోనూ వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కుల, వర్గ భేదాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యంగా ఉత్సవాల్లో పాల్గొని సనాతన ధర్మ వైభవాన్ని చాటాలని కోరారు.

గణేష్ నవరాత్రుల సందర్భంగా పిల్లలకు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ధార్మిక విలువలను పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర సమితి సూచించింది. భక్తి, శ్రద్ధలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.