News

విజయవాడలో జిమ్ ట్రైనర్‌ అబ్దుల్ ఖాదర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

38views

దళిత యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి.. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ దఫదఫాలుగా నగదు దోచుకుంటున్న జిమ్‌ ట్రైనర్‌పై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన దళిత యువతి (23) ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గత ఏప్రిల్‌లో ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా దేవినగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ఖాదర్‌ పరిచయమయ్యాడు. తాను జిమ్‌ ట్రైనర్‌నని, లావు తగ్గించి సన్నబడేలా చేస్తానని మాటలు కలిపాడు.

తాను పనిచేస్తున్న సత్యనారాయణపురంలోని రాక్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ జిమ్‌కి రమ్మని పిలిచాడు. అతని మాటలు నమ్మిన యువతి అక్కడ చేరింది. కొద్దిరోజుల తర్వాత తనకు సమీపంలోని ఒక హోటల్‌లో రూమ్‌ ఉందని.. అందులోనే ప్రొటీన్‌ షేక్‌లు ఉన్నాయని.. అక్కడకు వస్తే వాటిని ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. రూమ్‌లో సిద్ధంగా ఉంచిన ప్రోటీన్‌ షేక్‌ తాగమని ఇవ్వడంతో ఆమె తాగింది. తాగిన కొద్దిసేపటికి యువతి మత్తులో జారుకుంది. మూడు గంటల తరువాత మెలకువ వచ్చి చూడగా తన వంటిపై దుస్తులు లేకుండా ఉండటంతో భయంతో కేకలు వేసింది.

‘ఇదంతా ఇక్కడ కామన్‌. నా వద్ద నీ న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. విషయం ఎవరికైనా చెబితే వాటిని సోషల్‌ మీడియాలో పెడతా’నని అబ్దుల్‌ ఖాదర్‌ బెదిరించి పలుమార్లు లైంగిక దాడిచేశాడు. అనంతరం తనకు ఐఫోన్‌ కావాలని.. డబ్బులు కావాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో అన్నీ చేసింది. అయినా ఆమెను వదలకుండా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేర్వేరు చోట్ల అత్యాచారం చేశాడు.

పెళ్లిచేస్తామని సర్దిచెప్పి..
అబ్దుల్‌ఖాదర్‌ వేధింపులు భరించలేని యువతి గతనెల 23న తన స్నేహితురాలిని తీసుకుని అతడి ఇంటికెళ్లింది. విషయాన్ని అతడి తల్లికి చెప్పగా ఇద్దరికి పెళ్లి చేస్తామని నచ్చజెప్పి పంపించేసింది. ఆ తరువాత నుంచి మాటమార్చి కులం ప్రస్తావన తెస్తూ దుర్భాషలాడింది. మరోవైపు నిందితుడు తన ఫోన్‌లోని నగ్న ఫొటోలు, వీడియోలను జిమ్‌లోని ఇతరులకు చూపిస్తుండడంతో బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్దుల్‌ఖాదర్‌ పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.