ArticlesNews

మతోన్మాదులకు మరణదండన

31views

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్షకు, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ సిటీ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు జూలై ఏడవ తేదీన సమర్థించింది. దేశంలోని అత్యంత సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ఉగ్రవాద విచారణలలో ఒకదానిని చట్టపరమైన ముగింపునకు చేరువ చేసింది. అయితే ఆ తర్వాత నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వ్యవధి కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తన తీర్పు అమలుపై మూడు నెలల స్టేను హైకోర్టు విధించింది. ఈ మూడు నెలల వ్యవధిలో తాను ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసుకోవడానికి నిందితులకు అవకాశం ఇచ్చింది.

జూలై 26, 2008న 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్‌లో సివిల్ ఆసుపత్రి, ఎల్జీ ఆసుపత్రి, బస్సులు, నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, కార్లు సహా 22 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 56 మంది మరణించగా, మరో 200 మంది గాయపడ్డారు. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఏవై కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. దిగువ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని అప్పీళ్లను తిరస్కరించింది. ఈ కేసులో ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)సభ్యులకు విధించిన శిక్షలను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది. మార్చి 30, 2027లోగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దోషులుగా తేలినవారిలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఇన్ ఇండియా(సిమి) పూర్వ నాయకుడు సఫ్దర్ నాగోరి సహా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలకు చెందిన అతడి సహచరులు ఉన్నారు. ఈ వరుస పేలుళ్ల కేసులో మొత్తం 78 మందిని నిందితులుగా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. 2002 గోధ్రా అనంతర అల్లర్లకు ప్రతీకారం తీర్చుకోవడానికి సిమితో సంబంధం ఉన్న ఐఎం సభ్యులే ఈ వరుస పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 8, 2022న నిందితుýలో 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు న్యాయమÖర్తి ఏఆర్ పటేల్ నిర్ధారించారు. కేసులో 28 మందిని విడుదల చేశారు. దోషులలో ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారాడు. ఫిబ్రవరి 18, 2022న తీర్పు వెలువరించారు. ఉగ్రవాద కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా), భారత శిక్షాస్మృతిలోని 302 సెక్షన్ కింద 38 మందికి మరణ శిక్ష విధించారు. 11 మందికి సహజ మరణం సంభవించేవరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 48 మంది దోషులకు రూ.2.85 లక్షలు, ఒక దోషికి రూ.2.88 లక్షల జరిమానా విధించారు. దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దోషులు హైకోర్టులో సవాల్ చేశారు. అదే సమయంలో దోషుల శిక్షను ధ్రువీకరించాలని కోరుతూ హైకోర్టును గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. దోషులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు అన్నింటిని విచారణ సమయంలో హైకోర్టు ముందు ఉంచింది. హైకోర్టు ఈ కేసును ఒకటిన్నర సంవత్సరాలకు పైగా విస్తృతంగా విచారించిందని, ఫిబ్రవరి, 2026 నుంచి రోజువారీగా విచారణ జరిపిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ తెలిపారు.

ఒకే కేసులో అత్యధికులకు మరణశిక్ష

ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో దోషులకు మరణశిక్ష విధించడం దేశ న్యాయస్థానాల చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి జనవరి, 1998లో కేసులో 26 మంది దోషులకు తమిళనాడులో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత వరుస పేలుళ్ల కేసులో 38 మందికి అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.

జైలులో సొరంగం ద్వారా తప్పించుకునే కుట్ర

ఈ కేసు విచారణ సమయంలో ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. 2013లో సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్న కొందరు నిందితులు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వి తప్పించుకోవ డానికి పన్నిన కుట్రను భద్రతా సంస్థలు బయట పెట్టాయి. తప్పించుకునే ప్రయత్నం జరగకముందే జైలు అధికారులు ఆ సొరంగాన్ని గుర్తించడంతో ఈ కుట్ర భగ్నమైంది.

దోషుýలో మత గురువు, జర్నలిజం పట్టభద్రుడు, వ్యాపారి

ఉరిశిక్ష ఎదుర్కొంటున్న నిందితులలో ఒకడు సఫ్దర్ నాగోరి (ఉజ్జయిని). ఇతడు నిషేధిత సిమికి మాజీ అధిపతి. జర్నలిజంలో డిగ్రీ కలిగి ఉన్నారు. ఈ నెట్‌వర్క్‌కు “ప్రధాన నిర్వాహకుడి”గా గుర్తింపు పొందిన ఇతడు కేరళ, కర్ణాటకలలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహించాడు. మదర్సా ఉపాధ్యాయుడైన ముఫ్తీ అబూ బషీర్ (అజమ్‌గఢ్) ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న “సైద్ధాంతిక శక్తి”గా నిలిచాడు.ఖయాముద్దీన్ కపాడియా (వడోదర) వ్యాపారి, మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేశాడు. గుజరాత్‌లో పేలుళ్లకు అవసరమైన సామాగ్రిని సాజిద్ మన్సూరి (భరూచ్) సమకూర్చాడు. గుజరాత్ మాడ్యూల్‌కు చెందిన జాహిద్ షేక్, ఇమ్రాన్ ఇబ్రహీం షేక్, ఇక్బాల్ ఖాసీం షేక్, షంషుద్దీన్ షాబుద్దీన్ షేక్, గ్యాసుద్దీన్ అబ్దుల్, అలీమ్ అన్సారీ, మహ్మద్ ఆరిఫ్ కాగ్జీ, యూనస్ మొహమ్మద్ భాయ్ మన్సూరి, అబ్బాస్ సమేజా, ఇస్మాయిల్ అహ్మద్ దుకాణాల్లో పనిచేసేవారు.

బాంబుల తయారీదారులు

మహారాష్ట్రకు చెందిన ఒక సాంకేతిక ముఠా ఈ బాంబులను తయారు చేసింది. ఇందులో పూణేకు చెందిన కంప్యూటర్, ఐటీ నిపుణుడు మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌధరి, ఆసిఫ్ హసన్ షేక్ ఉన్నారు. ముంబైకి చెందిన అఫ్జల్ ఉస్మానీ పేలుడు పదార్థాలతో నింపిన కారును అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ట్రామా సెంటర్ పార్కింగ్ స్థలంలోకి నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు జరిగిన పేలుళ్ల కారణంగా బాధితులు, వైద్యులు, సహాయక సిబ్బంది ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఈ బాంబు పేలింది. ఈ ఘటనలో 37 మంది మరణించడంతో పాటు, నగర అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ స్తంభించిపోయింది. అతీక్-ఉర్-రెహమాన్ నేతృత్వంలోని రాజస్థాన్ ముఠాలో టైలర్ మెహందీహాసన్ అన్సారీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్ అహ్మద్ ఉండగా, పోలీసులు మహమ్మద్ అలీని అరెస్టు చేశారు. వ్యాపారి అయిన ఖయాముద్దీన్ సోదరుడు రఫీయుద్దీన్ కపాడియాపై మందుగుండు సామాగ్రి నిల్వలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉండగా, స్థానిక మెకానిక్ అయిన మహమ్మద్ రఫిక్ అనేక బాంబులను తరలించడానికి సైకిళ్లను సమకూర్చాడు.

అహ్మదాబాద్‌లో బాంబుల ఫ్యాక్టరీ!

అహ్మదాబాద్‌లోని డాని లిమ్డా ప్రాంతంలో “బాంబు ఫ్యాక్టరీ”ని కనుగొన్నట్టు 2008లో జాయింట్ కమిషనర్ (క్రైమ్)గా దర్యాప్తునకు నేతృత్వం వహించిన మాజీ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. “అమ్మోనియం నైట్రేట్, ANFO అని పిలవబడే ఫ్యూయల్ ఆయిల్‌ను ఉపయోగించి వారు పేలుడు పదార్థాలను తయారు చేశారని మా దర్యాప్తులో వెల్లడైంది” అని భాటియా తెలిపారు.

ఉగ్రవాద విద్యార్థులు

ఉత్తరప్రదేశ్ నెట్‌వర్క్‌లో సైఫ్-ఉర్-రెహ్మాన్ అన్సారీ, మహమ్మద్ తన్వీర్ పఠాన్, జీషన్ అహ్మద్, జియా-ఉర్-రెహ్మాన్, మహమ్మద్ షకీల్, మహమ్మద్ ఆరిఫ్ మీర్జా, మహమ్మద్ సైఫ్ ఉన్నారు. వీరిలో చాలామంది విద్యార్థులు.ఆయుధాల సరఫరా వ్యవస్థను సమకూర్చడంలో వడోదరకు చెందిన అగర్‌బత్తీల వ్యాపారి మహమ్మద్ ఉస్మాన్ అగర్‌బత్తీవాలా సహకరించినట్లు తేలింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న ఇతరులలో మధ్యప్రదేశ్‌కు చెందిన కమ్రుద్దీన్ అలియాస్ రాజా మహమ్మద్, ఆమిల్ పర్వాజ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన షిబ్లీ అలియాస్ సాబిత్ అబ్దుల్ కరీమ్ ఉన్నారు.

తీర్పును స్వాగతించిన బాధిత కుటుంబాలు

జూలై 26, 2008న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో తన తండ్రి దుష్యంత్, అన్నయ్య రోహన్‌లను కోల్పోయినప్పుడు యశ్ వ్యాస్ వయసు కేవలం ఎనిమిది ఏళ్లు. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుజరాత్ హైకోర్టు తీర్పును స్వాగతించారు. “ఈ తీర్పు సముచితమైనది. ఆ పేలుళ్లలో నా తండ్రి, నా అన్నయ్య, అనేకమంది మరణించారు” అని తెలిపారు. ఆయన తండ్రి ఆ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేసేవారు, మరణించిన సమయంలో విధి నిర్వహణలో ఉన్నారు. “అక్కడి ఖాళీ ప్రదేశంలో సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మేమిద్దరం (వ్యాస్, రోహన్) మా తండ్రితో కలిసి వెళ్లాము. మేము ఇంటికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఒక రోగిని ట్రామా సెంటర్‌కు చేర్చడంలో సహాయం కోరుతూ మా తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మేము ఆ కేంద్రానికి చేరుకున్న సమయంలోనే పేలుడు సంభవించింది” అని వ్యాస్ తెలిపారు.

సివిల్ హాస్పిటల్‌లో జరిగిన బాంబు దాడిలో మరణించిన వారిలో జశ్వంత్ పటేల్ (59) కూడా ఉన్నారు. పటేల్ అసర్వా ప్రాంతంలో ఒక గ్యారేజీని నడిపేవారు. అహ్మదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల బాధితులకు సహాయం చేయడానికి ఆయన అక్కడికి వెళ్లారు. ఆయన ఆసుపత్రి వద్ద ఉన్నప్పుడు ట్రామా సెంటర్ ముందు ఒక పేలుడు సంభవించింది. ఆయన కుమారుడు అమ్రిష్ (49) అదే గ్యారేజీని నడుపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అమ్రిష్ ఇలా అన్నారు, “మా నాన్నగారు సివిల్ ఆసుపత్రిలోని రోగులకు సహాయం చేసే స్థానిక బృందంలో ఒకరు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలియగానే ఆయన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన దాదాపు రెండు గంటల తర్వాత ఆయన మరణం గురించి నాకు తెలిసింది” అని అమ్రిష్ తెలిపారు. “మా నాన్నగారు గాయపడి నప్పుడు మా చిన్నాన్న ఆసుపత్రిలోనే ఉన్నారు. అప్పుడు సివిల్ ఆసుపత్రిలో గందరగోళం నెలకొనడంతో, ఆయనను సమీపంలోని రాజస్థాన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు” అని చెప్పారు. “హైకోర్టు నిందితులకు శిక్ష విధించడం మంచిదైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు” అని హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.