
విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం ఇక్కడ చదవచ్చు
లక్ష్యంలో స్పష్టత అవసరం
విమర్శకు గురయ్యే అంశం లేదా లక్ష్యం స్పష్ట మైన నిర్వచనానికి నోచుకోనప్పుడు హిందుత్వంపై జరిగే చర్చ గందరగోళానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, ఏదైనా ప్రభుత్వ విధానంపై ప్రశ్న తలెత్తినప్పుడు, ప్రభుత్వం సమాధానం చెప్పేలా చూడాలి. ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే, దానిని రాజకీయ కోణంలోనే పరిశీలించాలి. ఒక సంస్థ కార్యకలాపాలపై చర్చ జరుగుతున్నప్పుడు, ఆ సంస్థే చర్చకు కేంద్ర బిందు వుగా ఉండాలి. కానీ వీటన్నింటినీ కలిపేసినప్పుడు ఆ చర్చ స్వభావమే మారిపోతుంది. హిందుత్వ అనేది వేల సంవత్సరాలుగా పరిణామం చెందిన ఒక పరంపరాగతమైన సంప్రదాయం, జీవనవిధానంగా వర్థిల్లుతున్నది. అత్యధికులు హిందుత్వాన్ని ఒక సాంస్కృతిక నాగరికతాపరమైన అస్తిత్వంగా భావిస్తుండగా, కొందరు విమర్శకులు దీనిని ఒక రాజకీయ సిద్ధాంతంగా నిర్వచిస్తుంటారు. అదేవిధంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అనేది ఒక సంస్థ. భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. భారత ప్రభుత్వం ఒక రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ. వీటిలో ప్రతిదానికీ ఒక ప్రత్యేక స్వభావం, పాత్ర ఉన్నాయి. వీటిలో ఒకదానికి సంబంధించిన విమర్శను మరొక దానికి అన్వయించి నప్పుడు సమస్య తలెత్తుతుంది.
‘హూ ఈజ్ ఎ హిందూ?’ అనే తన పుస్తకంలో, స్వాతంత్య్ర వీర సావర్కర్ హిందుత్వం అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, అదొక ఇతిహాసమని పేర్కొన్నారు. హిందూ సమాజాన్ని తీర్చిదిద్దిన సాంస్కృతిక, సామాజిక, జాతీయ అంశాలన్నింటి సమ్మేళనమే హిందుత్వం. 1995లో, రమేష్ యశ్వంత్ ప్రభు వర్సెస్ ప్రభాకర్ కుంటేలి కేసులో ‘హిందుత్వం‘ను విశ్లేషిస్తూ భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
హిందుత్వం, హిందూ ధర్మాన్ని సంకుచిత మతతత్వ దృక్పథంతో చూడకూడదని జస్టిస్ జె.ఎస్.వర్మ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. భారతీయ యవనికపై హిందుత్వం అనే పదం జీవన విధానాన్ని, సాంస్కృతిక దృక్పథాన్ని సూచిస్తుందని తెలిపింది.
మాట నుండి నింద వరకు..
సార్వజనిక జీవితంలో మాటలు కేవలం మాటలుగా మాత్రమే మిగిలిపోవు. కాలక్రమేణా అవి అర్థాన్ని సంతరించుకుంటాయి. భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. రాజకీయ, సామాజిక ప్రభావాలను కలిగిస్తాయి. ఒక భావనను లేదా అస్తిత్వాన్ని సమాజం ఏ విధంగా చూస్తుందనేది కేవలం వాస్తవాల ద్వారానే కాకుండా, దాని గురించి చర్చించడానికి ఉపయోగించే భాష మీద కూడా ఆధారపడి ఉటుంది. ఒక పదాన్ని వివాదాస్పదంగా మార్చడంలో ఒక ప్రక్రియ ఇమిడి ఉంటుంది. వివాదాన్ని సృష్టించాలనుకునేవారు మొదటగా తమకు పనికి వచ్చే పదాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత దానిని ఏదైనా నైతిక ముప్పు, సామాజిక సమస్య లేదా రాజకీయ భయంతో ముడిపెడతారు. ఆ ముప్పు వాస్తవమేనని నిరూపించడానికి నిర్దిష్ట సంఘటనలను, ఉదాహరణలను తెరపైకి తీసుకొని వస్తారు. క్రమంగా, ఈ ఉదాహరణలను ఒక విస్తృతమైన ధోరణికి లేదా సరళికి సంబంధించిన సాక్ష్యాలుగా చూపించడం మొదలుపెడతారు. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగా విశ్వవిద్యా లయాలు, పరిశోధనా పత్రాలు, మీడియా చర్చలు, డిజిటల్ వేదికల ద్వారా అదే భావన విస్తృత ప్రజానీకానికి చేరుతుంది. నిరంతర పునరావృతం వల్ల, ఆ భావన సామాన్య అవగాహనలో ఒక భాగంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది మూలాన్ని అధ్యయనం చేసినా, చేయకపోయినా, ఆ భావనను అదే కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఆరోగ్యకరమైన చర్చలో వాస్తవాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది, ఆ తర్వాతే నిర్ధారణలు వస్తాయి. అయితే, వాస్తవాల కంటే ముందే నిర్ధారణకు వచ్చినప్పుడు, భావజాలం, పక్షపాతానిదే పైచేయి అవుతుంది.
సమంజసమైన విమర్శ
హిందుత్వాన్ని విమర్శించేవారు తరచుగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. హిందుత్వానికి సంబంధించిన విమర్శలు, బహిరంగ చర్చలను వాస్తవికత, సమతుల్యత, నిష్పాక్షికత వంటి ప్రమాణాల ఆధారంగానే అంచనా వేయాలి. ప్రజాస్వామ్యంలో విమర్శ అత్యవసరమైనది. సమాజం, ప్రభుత్వం, సంస్థలు, భావజాలాలు ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అవి మెరుగుపడతాయి. కనుక విమర్శ అనేది సర్వసాధారణమైన విషయమే. కాకపోతే ఆ విమర్శ చేసే విధానం, దాని వెనుక ఉద్దేశం ప్రశ్నార్థకమవుతున్నది. ఒక సామాజిక వర్గం కులపరమైన వివక్ష సమస్యను ఎదుర్కొంటున్న ట్లయితే, ఆ అంశంపై చర్చ జరగాలి. ఎక్కడైనా మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుంటే దానిపై ప్రశ్నలు లేవనెత్తాలి. ఏదైనా అల్పసంఖ్యాక వర్గం అభద్రతాభావానికి లోనైతే ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి. ఇవన్నీ సమంజసమైన విమర్శ పరిధిలోకి వస్తాయి. అయితే కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా ఒక సమÖహంపై కచ్చితమైన తీర్పు ఇచ్చినప్పుడు పరిస్థితి మారుతుంది. ప్రతి నాగరికత, దేశం లేదా సమాజంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. కేవలం ప్రతికూల ఉదాహరణల ఆధారంగా ఒక సమూహం మొత్తాన్ని దోషిగా ముద్ర వేస్తే, అది కేవలం విమర్శగా మిగిలి పోదు. ప్రపంచమంతటా విస్తరించే ఒక ఆరోపణగా రూపాంతరం చెందుతుంది.
ఒక కథనం ఎలా వ్యాపిస్తుంది?
హిందుత్వకు సంబంధించిన అభిప్రాయాలను, చర్చలను అర్థం చేసుకోవాలంటే, సమాజంలో అవి ఏయే మాధ్యమాలు, ప్రక్రియల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయో పరిశీలించడం కూడా అత్యవసరం. ఏ ప్రధాన భావన అయినా రాత్రికి రాత్రే సమాజంలో స్థిరపడిపోదు. దాని వెనుక వివిధ స్థాయిలలో పనిచేసే ప్రక్రియలు ఉంటాయి. ఒక విశ్వవిద్యాలయంలో ఒక నిర్దిష్ట భావజాలం లేదా సామాజిక సమూహానికి సంబంధించిన ఒక నిర్దిష్ట ముగింపును తెలియజేసే పరిశోధనా పత్రం ప్రచురితమైందనుకుందాం. మొదట్లో దీనిని కొద్దిమంది మాత్రమే చదువుతారు. అయితే, అదే భావన మీడియా కథనాల్లో కనిపించడం, టీవీ చర్చల్లో చోటు చేసుకోవడం, సోషల్ మీడియాలో చిన్న వీడియోలు, పోస్టుల రూపంలో విస్తృతంగా వ్యాపించడం మొదలైనప్పుడు దాని ప్రభావం పెరుగుతూ వస్తుంది. అందుకే, ఒక కథనం లేదా భావనాశక్తి కేవలం దానిలోని ఆలోచనలలోనే కాకుండా, దానిని వ్యాప్తి చేసే విధానాలలో కూడా ఇమిడి ఉంటుంది. నేడు విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, డిజిటల్ వేదికలు, సామాజిక సంస్థలు, ప్రభావవంతమైన వక్తలు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు, ప్రవాస సమాజాలు అన్నీ ఒక భావనను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించగలవు. ఏ భావన కూడా ఒంటరిగా ప్రయాణించదు. అది వివిధ మాధ్యమాల ద్వారా ప్రయాణించే కొద్దీ మరింత ప్రభావవంతంగా మారుతుంది.





