
29views
పాకిస్తాన్‌లో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయాల వంటి మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల దీనస్థితిపై యూరోపియన్ పార్లమెంట్‌లో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ బాధితులకు రక్షణ కల్పించాల్సిన కోర్టులు, పోలీసు యంత్రాంగం నిందితులకు కొమ్ముకాస్తున్నాయని ప్రతినిధులు ఆరోపించారు. ముస్లిం దుండగుల తప్పులను కప్పిపుచ్చడానికే అక్కడి చట్టపరమైన వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయని ప్యానలిస్టులు మండిపడ్డారు. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకునేలా యూరోపియన్ యూనియన్ (EU) ఏ రకమైన చర్యలు తీసుకోగలదనే అంశంపై చట్టపరమైన నిపుణులు, మానవ హక్కుల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బలవంతపు మతమార్పిడులు, పెళ్లిళ్లు, మైనారిటీల రక్షణ, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల భద్రతపై పాకిస్తాన్‌ను గట్టిగా నిలదీయాలని వారు నిర్ణయించారు.
గత వారం యూరోపియన్ పార్లమెంట్‌లో మరియా షాబాజ్ అనే బాలిక కిడ్నాప్, బలవంతపు మతమార్పిడి, బాల్యవివాహంపై ఒక కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనిని పురస్కరించుకుని నెదర్లాండ్స్‌కు చెందిన ‘జుబిలీ క్యాంపెయిన్’ ప్రతినిధి మిరియామ్ బోస్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈపీ (మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్) మాటేజ్ టోనిన్ మాట్లాడుతూ.. సమాజంలో నిరుపేదలు, బలహీనవర్గాలను విస్మరించకూడదని, మైనారిటీలను నిర్లక్ష్యం చేయవద్దని పాకిస్తాన్‌కు హితవు పలికారు. తీర్మానం ఆమోదంలో కీలక పాత్ర పోషించిన మరో ఎంఈపీ రూయిసెన్ మాట్లాడుతూ.. మరియా షాబాజ్ లాంటి ఎంతోమంది బాలికలను రక్షించి, వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. వేధింపులకు గురిచేసిన నిందితులకే తిరిగి ఆ పిల్లలను అప్పగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు కాకుండా నిందితులకే కోర్టుల మద్దతు:
మైనారిటీ బాలికల రక్షణ కోసం పాకిస్తాన్ ఏం చేయాలో మానవ హక్కుల న్యాయవాది సులేమా జహంగీర్ కొన్ని కీలక సూచనలు చేశారు. 16 ఏళ్ల లోపు బాల్యవివాహాల కేసుల్లో అత్యాచార నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె కోరారు. అయితే, అక్కడి న్యాయవ్యవస్థకు చట్టాన్ని అమలు చేయాలనే ఆలోచన లేదని, నిందితులను శిక్షించాలనే పట్టుదల కరువైందని విమర్శించారు. జాతీయ చట్టాలను పక్కనబెట్టి, ఇస్లామిక్ షరియా నిబంధనలను వాడుకుంటూ మైనారిటీ బాలికల పెళ్లిళ్లను, బలవంతపు మతమార్పిడులను కొందరు న్యాయమూర్తులు సమర్థిస్తున్నారని ఉదాహరణలతో సహా వివరించారు. బాలికలు యుక్తవయస్సుకు వస్తే పెళ్లి చేయవచ్చంటూ తీర్పులు ఇస్తున్నారని, ఇలాంటి మతమార్పిడుల వల్ల ఆ ఆడపిల్లలు తమ క్రైస్తవ కుటుంబాలకు పూర్తిగా దూరమై న్యాయం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆమె పేర్కొన్నారు.
జుబిలీ క్యాంపెయిన్ ప్రతినిధి జోసెఫ్ జాన్సెన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ చట్టాలు క్రైస్తవ మైనారిటీ బాలికల విషయంలో పూర్తిగా వివక్ష చూపుతున్నాయని మండిపడ్డారు. “ఒకవేళ బాధితులు న్యాయమూర్తుల కూతుళ్లే అయితే ఇలాగే చేస్తారా?” అని ప్రశ్నించారు. లాహోర్‌లో 2025 జూలైలో అపహరణకు గురై, బలవంతంగా పెళ్లి, మతమార్పిడి చేయబడిన 12 ఏళ్ల క్రైస్తవ బాలిక మరియా షాబాజ్ కేసుపై యూరోపియన్ పార్లమెంట్ తీసుకున్న తీర్మానాన్ని ఆయన స్వాగతించారు. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ చర్యలను గమనిస్తోందనే బలమైన సందేశాన్ని ఈ తీర్మానం పంపిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
210 మంది క్రైస్తవ బాలికల అపహరణ, అత్యాచారం, బలవంతపు మతమార్పిడి:
ఈ సమావేశంలో జుబిలీ క్యాంపెయిన్ నెదర్లాండ్స్, వాయిస్ ఫర్ జస్టిస్ సంస్థలు సంయుక్తంగా ‘స్టోలెన్ గర్ల్స్’ (దోపిడీకి గురైన బాలికలు) పేరిట ఒక నివేదికను విడుదల చేశాయి. 2019 నుండి 2026 మధ్య కాలంలో పాకిస్తాన్‌లో 210 మంది క్రైస్తవ బాలికలపై జరిగిన అపహరణలు, అత్యాచారాలు, బాల్యవివాహాలు, లైంగిక దాడుల వివరాలను అందులో పొందుపరిచారు. ఇవి ఏదో పొరపాటున జరిగిన ఘటనలు కావని, మైనారిటీ బాలికలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృతంగా జరుగుతున్న దాడులని జాన్సెన్ స్పష్టం చేశారు. బాధితులంతా చిన్న పిల్లలని, వారు సొంతంగా మతాన్ని గానీ, భాగస్వామిని గానీ ఎంచుకునే వయసులో లేరని చెప్పారు. బాధితులకు, నిందితులకు మధ్య సగటు వయసు వ్యత్యాసం 24 ఏళ్లు ఉందని, నిందితుల్లో ఎక్కువమంది 40 నుండి 60 ఏళ్ల వయసున్న ముస్లిం పురుషులేనని వెల్లడించారు. అంతేకాకుండా, 96 శాతం కేసుల్లో మతమార్పిడి తర్వాత బాలికల క్రైస్తవ పేర్లను మార్చేశారని, 92 శాతం కేసుల్లో వారు మేజర్లుగా కనిపించేలా పెళ్లి పత్రాల్లో వయసును తప్పుగా సృష్టించారని నివేదిక బట్టబయలు చేసింది.
తల్లిదండ్రులకు కాకుండా కిడ్నాపర్లకే పిల్లల అప్పగింత:
పాకిస్తాన్ న్యాయవ్యవస్థలోని లోపాలను జోసెఫ్ జాన్సెన్ తీవ్రంగా ఎండగట్టారు. నిందితుల అదుపులో ఉన్న సమయంలోనే బాలికల నుంచి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని, భయభ్రాంతుల మధ్య ఇచ్చే ఆ స్టేట్‌మెంట్లను కోర్టులు పరిగణనలోకి తీసుకుని తప్పుడు పత్రాల ఆధారంగా ఆ పిల్లల బాధ్యతను (కస్టడీ) తల్లిదండ్రులకు కాకుండా కిడ్నాపర్లకే అప్పగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరియా షాబాజ్ లాంటి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు నాశనమైందని, వారి కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. బలవంతపు మతమార్పిడులను నేరంగా పరిగణించాలని, అపహరణకు గురైన పిల్లలను వెంటనే స్వతంత్ర సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని శిక్షించాలని ఆయన పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు చెందిన వీడియో క్లిప్పింగులను స్క్రీన్లపై ప్రదర్శించినప్పుడు హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల నుంచి వచ్చిన పాకిస్తానీ డయాస్పోరా (వలసదారులు) ప్రతినిధుల ముఖాల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. తమ ఆడపిల్లలను రక్షించాలంటూ ఆ వీడియోలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పాకిస్తాన్‌లోని క్రైస్తవ మహిళల అక్రమ పెళ్లిళ్లపై పుస్తకం రాసిన అన్నా టౌన్‌సెండ్ మాట్లాడుతూ.. ఆ పిల్లల చిన్నతనాన్ని ముస్లిం నేరగాళ్లు పూర్తిగా దొంగిలించారని ఆరోపించారు. ప్రొఫెసర్ డాక్టర్ షోబీన్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్‌కు కల్పించిన GSP+ (ప్రత్యేక వాణిజ్య రాయితీలు) హోదాను ప్రస్తావించారు. మానవ హక్కులు, సుపరిపాలనను గౌరవించేలా పాకిస్తాన్‌ను ఒప్పించడానికి ఈ ఆర్థిక రాయితీల వేదికను ఈయూ ఒక ఆయుధంగా వాడుకోవాలని సూచించారు. 2027 జనవరి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్పీ నిబంధనల ప్రకారం.. ఇలాంటి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే దేశాలపై తక్కువ సమయంలోనే వాణిజ్య రాయితీలను రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని చట్టపరమైన నిపుణులు ఈయూ పార్లమెంట్ సభ్యులను కోరారు.





