
57views
పాలక్కాడ్ (కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల (శతాబ్ది వర్ష్) సందర్భంగా ప్రారంభించిన ‘పంచ్ పరివర్తన్’ ఉద్యమం ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమని కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చంద్రనగర్‌లోని పార్వతి కల్యాణ మండపంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంఘిక్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా శంకరాచార్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికత ప్రాధాన్యతను వివరించారు. టెక్నాలజీని సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల మేలు కోసమే ఉపయోగించాలని సూచించారు. సాంకేతిక పురోగతికి ఉన్న సరళత, నిబద్ధత, వేగం వంటి లక్షణాలను సమాజ వికాసానికి ఉపయోగపడేలా మలచుకోవాలని కోరారు.
కేరళను “పవిత్రమైన తంత్ర భూమి”గా అభివర్ణించిన స్వామీజీ.. ఇతరుల కుట్రలకు ఈ పుణ్యభూమి బలి కాకుండా ప్రజలు కాపాడుకోవాలని హెచ్చరించారు. మన కర్తవ్యానికి నాలుగు ముఖ్యమైన స్తంభాలు ఉన్నాయని.. అవి ధర్మాన్ని చదవడం, దాని అర్థాన్ని గ్రహించడం, ఆచరించడం మరియు ప్రచారం చేయడమని తెలిపారు. అయితే, ప్రస్తుత రోజుల్లో ధర్మాన్ని అర్థం చేసుకోవడం, ఆచరించడం కంటే.. ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగా సంస్కృత భాషను, భారతీయ సంస్కృతిని రక్షించి, పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తి, దేశభక్తి రెండూ ముఖ్యమైనవే అయినప్పటికీ.. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ, సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంచీ శంకరాచార్యులకు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం.. ఆయన గురువుగారైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సైతం వడక్కంతరలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సాంఘిక్ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.





