
ఏకాత్మ మానవతావాద మాత్రమే దేశాన్ని సంఘటితంగా ఉంచగలరని భావించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన ద్వారా భిన్న సంస్కృతులను ఒక గూటికి చేర్చి బలమైన శక్తివంతమైన సమాజ నిర్మాణానికి 100 సంవత్సరాల క్రితం పునాదులు వేసిన డాక్టర్ హెడ్గేవార్ జీ దార్శనికత శ్రేయోదాయకమని ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ కస్తూరి రాకా సుధాకర్ రావు పేర్కొన్నారు.
దుర్గాదాస్ గా పేరు గడించిన గోపరాజు వెంకట సుబ్బారావు రచించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్మాత “నవధదీచి – మన డాక్టర్ జీ” (గద్య నాటకం) పుస్తకావిష్కరణ సభ స్థానిక అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో వందేమాతర గీతంతో ఘనంగా ప్రారంభించారు. పుస్తకాన్ని సంఘ్ శ్రేయోభిలాషి జూపూడి హైమావతి ఆవిష్కరణ చేయగా ముఖ్య వక్తగా పాల్గొన్న సుధాకర్ రావు మాట్లాడుతూ నిద్రాణిస్తున్న హిందూ సమాజాన్ని మేల్కొల్పి కర్తవ్యొముఖలను గావించేందుకు ఆర్ఎస్ఎస్ ను స్థాపించడంలో కీలక భూమిక పోషించారన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరములో ‘నవధదీచి మన డాక్టర్ జి’ నాటకం కూడా శతాబ్ద కాలం పాటు జాతి పునర్జీవాన్ని కొనసాగించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పుస్తక రచయిత దుర్గా దాస్ మాట్లాడుతూ, భారతమాత ప్రేరేపణతో డాక్టర్ జి జీవితం మీద పుస్తకం రాయటం జరిగిందని చెప్పారు. టీజెపీఎస్ కళాశాల కార్యదర్శి కె.వి బ్రహ్మం అధ్యక్షత వహించగా గుంటూరు విభాగ్ సంఘచాలక్ డాక్టర్ కే.ఎస్.ఎన్ చారి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం డాక్టర్ జి స్థాపించిన ఆర్ఎస్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా వేలాది శాఖలతో లక్షలాదిమంది కార్యకర్తలతో జాతి జీవన రంగాలన్నిటిని పునీతం చేస్తూ గంగా ప్రవాహంలా సాగుతున్నదని తెలియజేశారు. సభకు గడియారం రామకృష్ణ స్వాగతం పలుకుగా కార్యక్రమంలో అంగలకుదురు వాసు దాస స్వామి పీఠాధిపతులు సీతారామ స్వామి, డాక్టర్ భోగరాజు విజయభాస్కర్, జూపూడి రంగరాజు, సెర్చ్ ఆర్గనైజేషన్ మన్నవ హనుమ ప్రసాద్, కిషోర్, శ్రీధర్, సాయి కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సంఘ్ ప్రముఖులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





